తన భార్య అనారోగ్యంతో బాధపడుతుండడం, పని ఒత్తిడి, మానసిక వేదనతో ఓ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల ప్రకారం.. విజయనగరంలోని ఆర్అండ్్బ రైతు బజారు సమీపంలో నివాసముంటున్న టి. రమేష్ (59) సాలూరు పురపాలక సంఘంలో రెవెన్యూ అధికారి(ఆర్వో)గా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య జ్ఞానసుధ, పదేళ్ల కుమారుడు ఉన్నారు. ఆమె ఉపాధ్యాయిని. కొన్ని నెలల కిందట ప్రమాదం జరగడంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. రెండేళ్ల కిందట రమేష్ బొబ్బిలి పురపాలిక నుంచి సాలూరుకు బదిలీ అయ్యారు. భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడం, పని ఒత్తిడి.. తదితర కారణాలతో మానసికంగా కుంగిపోయారు. ఈనెల 8న ఇంట్లో విషం తాగి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి చనిపోయారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు.
[zombify_post]