ఆటో బోల్తా.. ఇద్దరి దుర్మరణం…
గంట్యాడ, గ్రామీణం, తమ బంధువులను పరామర్శించేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృత్యుఒడికి చేరారు. ఆటో బోల్తా పడడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన గంట్యాడ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు వివరాల ప్రకారం.. మురపాక గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు సోమవారం మధ్యాహ్నం మృతిచెందింది. ఆమె కుటుంబ సభ్యుల పరామర్శ కోసం బంధువులైన పొట్నూరు శ్రీనివాసరావు(53), సిరిపురపు సత్యం (60) మరికొందరితో కలిసి నడిచి వెళుతున్నారు. కొంత దూరం వెళ్లాక ఆ గ్రామానికి వెళ్తున్న ఆటో కనిపించింది. దీంతో అంతా ఆ వాహనం ఎక్కారు. అతివేగం, చోదకుడి నిర్లక్ష్యం కారణంగా కొంతదూరం వెళ్లాక బోల్తా కొట్టింది. దీంతో ఇద్దరూ దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా.. చిన్న పాపకు ఇటీవల పెళ్లి సంబంధం కుదిరింది. సత్యంకు భార్య, కుమారుడున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
[zombify_post]