తల్లి కోసం కన్నీరుమున్నీరుగా విలపించిన బిడ్డ!
అమ్మ ఏమి చేసిందో ఆ చిన్నారికి తెలియదు.. బిడ్డను ఓదార్చేందుకు ఆ తల్లికి దారి లేదు… తల్లీబిడ్డల బంధాన్ని జైలు గోడలు దూరం చేశాయి. తల్లి దూరమైందన్న ఆవేదన ఆ ఏడేళ్ల చిన్నారి నుంచి కన్నీటి రూపంలో ఉబికి వస్తోంది. అమ్మను చూడాలని, అమ్మతో మాట్లాడాలని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసిన వాళ్లందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. జైలు గోడకు అటుగా ఉన్న తల్లి కోసం, ఆ జైలు ముందే అమ్మా. అమ్మా.. అంటూ తడారిన గొంతుతో పిలుస్తున్న ఆ చిన్నారి పిలుపు మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. శుక్రవారం కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్ జైలు ఎదుట కనిపించిన దృశ్యమిది.
కర్నూలు పాతనగరానికి చెందిన ఓ మహిళ చోరీ కేసులో పట్టుబడగా పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆమెను మహిళా సబ్ జైలులో ఉంచారు. కానీ తల్లి ఎలాంటి తప్పు చేసిందో ఆ చిన్నారికి తెలియదు. ఆమె చేసిన నేరం గురించి ఆలోచించే వయస్సు కూడా ఆ బాలికకు లేదు. కేవలం అమ్మ దూరమైందన్న ఆవేదన ఆ చిన్నారిని జైలు వరకు వచ్చేలా చేసింది. తల్లిని చూడాలన్న ఆరాటం జైలు తలుపు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయేలా చేసింది.
స్థానికులు కొంత మంది జైలు అధికారులను విజ్ఞప్తి చేయగా జైలు అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకు పిలిపించి కూతురికి చూపించారు. ఆ తర్వాత కూతురును కూడా లోపలికి తీసుకెళ్లింది. అనంతరం జైలు అధికారులు ఆ బిడ్డను వారి బంధువుల ద్వారా ఇంటికి పంపించి వేశారు
This post was created with our nice and easy submission form. Create your post!