డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
ప్రజలకు ప్రాథమిక అవసరాలైన విద్య వైద్య సౌకర్యాలను మెరుగ్గా అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.ఆలమూరు గ్రామంలో 5.98 కోట్ల రూపాయలతో సమూలంగా రూపురేఖలు మార్చి తీర్చిదిద్దిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆదివారం మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వై.యస్.జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యాలకు పెద్ద పీట వేస్తున్నారని, మనబడి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని, నాడు-నేడు పథకంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
గత ప్రభుత్వం చెయ్యకుండా గాలికి వదిలేసిన పేద ప్రజలకు ఉపయోగపడే పనులన్నింటినీ నేటి ప్రభుత్వం చేస్తుండడంతో దానిని చూసి ప్రతిపక్షాలకు మింగుడు పడట్లేదని, ఫ్యామిలి డాక్టర్ కాన్సెప్ట్ ను అమలుచేసి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, గతంలో బ్రష్టుపట్టించిన 104,108 సేవలకు ముఖ్యమంత్రి జగన్ తిరిగి జీవం పోశారని, ఆరోగ్యశ్రీని తిరిగి గాడిలో పెట్టి ప్రజలకు వైద్యం అనంతరం విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందచేస్తున్నారని, త్వరలోనే రాష్ట్రం మొత్తం 45 రోజుల పాటూ ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్దకు ప్రభుత్వ ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, ఎంతో కాలం నుండి గత ప్రభుత్వాలు సీతకన్నేసి వదిలేసిన చాలా వరకు రోడ్లను నిర్మించడం జరిగింది అని, ప్రతీ గ్రామంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు నిర్మించడం జరిగింది అని, చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మర్చివేయడం జరిగింది అని, కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ర్యాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలను అతి త్వరలోనే ప్రారంభిస్తామని, మిగిలిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను కూడా ఆధునీకరించి ప్రతీ పి.హెచ్.సి.లో కనీసం ఇద్దరు డాక్టర్లను నియమించి పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్న ఏకైక ప్రభుత్వం మనదని అన్నారు.ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
[zombify_post]