అరుకులోయ నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా:మన్యంలో డోలీమోతలు నిత్యకృత్యమయ్యాయి. వంతెనలు, రహదారులు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు, గర్భిణులను ఆసుపత్రులకు తరలించేందుకు డోలీమోతలే దిక్కవుతున్నాయి.జామిగుడ పంచాయతీ గుంజివాడ గ్రామానికి చెందిన పాంగి ఎస్తేరు గర్భిణి. ఈమెకు శుక్రవారం పురిటినొప్పులు రావడంతో అతికష్టం మీద డోలీ మోతతో గుంజివాడ వాగు దాటించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించారు. ఎస్తేరు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
వాగుపై వంతెన నిర్మాణానికి కొద్దినెలల క్రితం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ శంకుస్థాపన చేశారు. నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. తక్షణమే అధికారులు స్పందించి వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. మన్యంలో బైక్ అంబులెన్స్లున్నా మారుమూల గ్రామాలకు ఉపయోగపడటం లేదు. గర్భిణులను ప్రసవానికి వారం ముందే బర్త్ వెయిటింగ్ వసతిగృహాలకు తరలించే ఏర్పాట్లు చేస్తే ఈ కష్టాలుండవని పలువురు అంటున్నారు. అధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేయాలని కోరుతున్నారు.
[zombify_post]