జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, నారాయణవరపు శ్రీనివాస్ ధ్వజం
బీసీ హాస్టళ్లను మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించారు. 8 నెలలుగా మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో హాస్టళ్లకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, నూనెలు, పప్పులు, చికెన్, గుడ్లు ఇతర ఆహార దినుసులు సరఫరా చేసే వ్యాపారులకు బిల్లులు చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వారు సరఫరాను నిలిపివేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో హాస్టళ్లను మూసివేసే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో 700లకు పైగా బీసీ హాస్టళ్లలో ఆశ్రయం పొందుతున్న 70 వేల మంది విద్యార్థుల మెస్ చార్జీల బిల్లులు 8 నెలలుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. భవనాల అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేశారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారన్నారు. తొమ్మిదేళ్లుగా ఒక్కరికి కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వ లేదన్నారు. రాష్ట్రంలో 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 321 బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేవని, వాటికి కేటాయించిన ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ సంస్థలకు ధారదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఇతర కులాలకు పూర్తి ఫీజులు మంజూరు చేస్తూ కేవలం బీసీ విద్యార్థులపై వివక్ష చూపడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి బీసీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
[zombify_post]