సెప్టెంబర్ 22:
నూతన పార్లమెంట్ భవనంలో జరిగిన మొదటి లోకసభ సమావేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.
దాదాపు 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అయితే ఈ బిల్లు అమల్లోకి రావాలంటే మాత్రం 2027 వరకు ఆగాల్సిందే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
మహిళా బిల్లులో కీలక అంశాలు..
*పార్లమెంటు శాసనసభల్లో 33 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు.
*ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ లేదు.
*ఒక స్థానం నుంచి ఇద్దరు మహిళా ఎంపీలు పోటీ చేసే అనుమతి లేదు.
డీ లిమిటేషన్ తర్వాతనే ఈ బిల్లు అమల్లోకి… 15 ఏళ్ళ పాటు కొనసాగుతుంది.
ఏమిటీ ? డీలిమిటేషన్..!
మహిళా రిజర్వేషన్ల బిల్లు తోపాటు వినిపిస్తున్న పదం.. డీలిమిటేషన్.
ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ల బిల్లు ఆమోదం సులభమైనాద దాని అమలు డీలిమిటేషన్ తో ముడిపడింది. ఇంతకూ ఏమిటీ ప్రక్రియ? ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? జనాభా ప్రాతిపదికన.. దేశంలో, రాష్ట్రాల్లో చట్టసభల నియోజకవర్గాల సంఖ్య, పరిధిలను నిర్ణయించే ప్రక్రియే డీలిమిటేషన్.
సులభంగా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటులో, అసెంబ్లీల్లో సీట్లుండేలా చూసే ప్రక్రియ. అంటే మారుతుండే జనాభాను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకునేలా మన రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ఇది.
డీలిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం. రాజ్యాంగంలోని 82వ అధికరణం ప్రకారం దీనిని చేపడతారు. ప్రతి పదేళ్లకోసారి జరిగే జనగణన తర్వాత ఇది జరగాలి. డీలిమిటేషన్ చట్టం ప్రకారం…. కేంద్ర ప్రభుత్వం ఓ కమిషన్ ను ఏర్పాటు చేస్తుంది. దీనికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యం వహిస్తారు. ఇది తాత్కాలిక కమిషన్ కాబట్టి శాశ్వత ఉద్యోగులంటూ ఇందులో ఉండరు. ఎన్నికల కమిషన్ సిబ్బందినే వినియోగించుకుంటారు.
దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల జనాభా గణాంకాలను సేకరించి, అధ్యయనం చేసి ఈ కమిషన్ తన ప్రాథమిక నివేదికను సమర్పిస్తుంది. ఇందుకు కనీసం ఐదేళ్ల సమయం పట్టే అవకాశముంది. దీన్ని గెజిట్ లో ప్రచురించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటినీ పరిశీలించాక తుది నివేదిక ఇస్తారు. ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ తుది నివేదిక ప్రచురించిందంటే దానిని పార్లమెంటు కూడా మార్చలేదు. ఏ కోర్టులోనూ సవాలు చేయడానికి లేదు. డీలిమిటేషన్ కమిషన్ ఏది చెబితే అది చట్టం అవుతుందంతే.
మొదటి డీలిమిటేషన్ ప్రక్రియ 1952లో జరిగింది. తద్వారా అప్పటి జనాభా ఆధారంగా లోక్ సభకు 494 నియోజక వర్గాలుగా నిర్ణయించారు. 1963లో రెండో డీలిమిటేషన్ కమిషన్ ఈ సంఖ్యను 522కు పెంచింది. 1973లో లోక్సభ సీట్లు 543కు పెరిగాయి. ఆ తర్వాత జనాభా పెరిగినా మళ్లీ డీలిమిటేషన్ లో భాగంగా సీట్లను పెంచలేదు. కారణం 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియను 25 సంవత్సరాలపాటు నిలిపేసింది. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేలా రాష్ట్రాలకు వెసులుబాటు ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరల 2001లో వాజ్ పేయ్ సర్కారు అదే కారణం చెబుతూ మరో పాతికేళ్ల దాకా అంటే 2026 దాకా డీలిమిటేషన్ కు దారులు మూసింది. మధ్యలో 2002లో జస్టిస్ కుల్డీప్ సింగ్ సారథ్యంలోని డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసినా అది కేవలం నియోజకవర్గాల పరిధులను మార్చడానికే పరిమితమైంది. సంఖ్యను పెంచలేదు.
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రాల్లో ఉన్న చట్టసభల సీట్ల సంఖ్య 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించినవే. సాధారణంగానైతే 2026లో గడువు ముగియగానే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టే వీలుండేది. కానీ పదేళ్లకోసారి చేపట్టే జన గణన 2021లో కొవిడ్ కారణంగా చేపట్టలేదు.
2024 ఎన్నికల తర్వాత జన గణన మొదలవుతుందని అంటున్నారు. ఇదంతా పూర్తయి, నివేదికలు సిద్ధమవడానికి మూడు నాలుగేళ్లు పట్టొచ్చని అంచనా. ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుంది.
అంతా సవ్యంగా సాగితే 2029 తర్వాతే కొత్త నియోజక వర్గాలతోపాటు మహిళలకు రిజర్వేషన్లు అమల్లోకి రావొచ్చు. మారిన జనాభా ప్రకారం.. పార్లమెంటులో లోక్ సభ సీట్లు 888 దాకా… రాజ్యసభ సీట్లు ప్రస్తుత 245 నుంచి 384కు పెరుగుతాయని అంచనా. ఇక్కడే గొడవ తలెత్తే అవకాశముంది. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రస్తుతమున్న లోక్సభ సీట్లు 80 నుంచి 143కు, బిహార్ సీట్లు 40 నుంచి 79కి పెరగొచ్చు. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో సీట్లు 17 దాకా తగ్గొచ్చు. తద్వారా హిందీ రాష్ట్రాల ప్రాబల్యం పార్లమెంటులో ఎక్కువ అవుతుంది. దీనిపై దక్షిణాది రాష్ట్రాల అధినేతలు కేంద్రం వద్ద ఇప్పటికే తమ అభ్యంతరాలను తెలియజేశారు. జనాభా నియంత్రణను పాటించి, అభివృద్ధి చెందుతున్నందుకు తమకు అన్యాయం జరుగుతుందని, దీనిని అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ లో ఏం చేస్తారనేది ఆసక్తికరం.
This post was created with our nice and easy submission form. Create your post!