సిపియస్ పై మాట తప్పి, మడమ తిప్పి నిలువునా మోసం చేయడం అన్యాయం….
*జీపీఎస్ తో ఉద్యోగుల్లో వ్యతిరేకత… ఉద్యోగులకు ప్రయోజనం సున్నా..
*పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి…ఎస్టీయూ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ జి.వీరచంద్ర యాదవ్.*
అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపియస్ ను రద్దుచేసి,ఓపియస్ ను అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పి,జీపీఎస్ పథకాన్ని మంత్రిమండలిలో ఆమోదించి ఉద్యోగులను మోసం చేయడం తగదని ఎస్టీయూ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ జి.వీరచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఎస్టీయూ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ జి.వీరచంద్ర యాదవ్ మాట్లాడుతూ……ప్రతిపక్షనేతగా పాదయాత్ర సమయంలో ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజుల్లో సిపియస్ ను రద్దు చేసి, ఓపియస్ ను అమలు చేస్తామని చెప్పిన మాటలు నీటిమూటల చందాన మారిపోయాయన్నారు. ముప్పై సంవత్సరాలు ప్రభుత్వానికి, ప్రజలకు సేవచేసిన ప్రభుత్వ ఉద్యోగులు పదవీవిరమణ తరువాత జీవితాలకు భధ్రత కలిగించే పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పి, ఇపుడు మాత్రం ఆరోజు అవగాహన లేక హామీ ఇచ్చామని చెబుతూ, మాటమార్చి ప్రత్యామ్నాయంగా తలాతోక లేని జిపియస్ ను అమలు చేస్తామని చెప్పి,కేబినెట్ లో పెట్టి ఆమోదించడం సమంజసం కాదన్నారు.ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై ఉద్యోగ,ఉపాధ్యాయులు ఆవేదనతో రగిలి పోతున్నారన్నారు. ఎటువంటి పరిస్థితులలో జిపియస్ ను అంగీకరించేది లేదన్నారు. సిపియస్ ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని,జీపీఎస్ పథకాన్ని తెచ్చి దానిని ఉద్యోగులపై బలవంతంగా రుద్ది,చేతులు దులిపేసుకోవాలనుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. పదకొండో పిఆర్సీ విషయంలో కూడా ఇదే మాదిరి కమిటీ నివేదిక బయటపెట్టకుండా, బలవంతంగా పీఆర్సీని అమలు చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు.ఎటువంటి హామీ ఇవ్వని మనకంటే చిన్న రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్,పంజాబ్,రాజస్థాన్, జార్ఖండ్,సిక్కిం లాంటి రాష్ట్రాలు సిపియస్ ను రద్దు చేసి,ఓపియస్ ను అమలు చేస్తుంటే,మన ప్రభుత్వం మాత్రం అది సాధ్యం కాదని చెప్పడం చూస్తే,ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిత్తశుధ్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు.ఇలా ప్రతి విషయంలో ఉద్యోగులను దగా చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు.బయటకు మాత్రం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెబుతూ, ఉద్యోగులను నిలువునా మోసం చేస్తున్నారన్నారు.దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తు చేసినప్పటికీ, దానిని కూడా తుంగలో తొక్కడం దుర్మార్గమన్నారు.బలవంతంగా అమలు చేయాలనుకుంటున్న జిపియస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, బలవంతం చేస్తే మరో ఛలో విజయవాడ లాంటి ఉద్యమాలు పునరావృతమవుతాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి,జిపియస్ ప్రతిపాదనను విరమించుకుని ఇచ్చిన హామీ మేరకు ఓపియస్ ను అమలు చేసి,తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.లేని పక్షంలో సంఘ పక్షాన,ఫ్యాప్టో పక్షాన జరిగే ఉద్యమాలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు….
This post was created with our nice and easy submission form. Create your post!