రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా: 'ఆ అధికారి నిర్లక్ష్యం కారణంగానే ఒక నిండు ప్రాణం బలైందని, ఇప్పుడా ఆ వ్యక్తి ప్రాణాన్ని తెచ్చివ్వగలడా, ఆ కుటుంబం కన్నీటిని తుడవగలడా?'..అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వైసీపీ కార్యకర్త ఏలూరు రామస్వామి (40) మృతిచెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కార్పెంటర్ గా కష్టపడుతూ కుటుంబాన్ని లాక్కువస్తున్న రామస్వామి అస్వస్థతకు గురవడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. పిడుగులాంటి వార్త చెప్పారు వైద్యులు. కిడ్నీలు పాడయ్యాయని. వైద్యం చేయించుకునే స్తోమత లేదు. కొడుకు అవస్థలు చూడలేని తల్లి తన కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైంది. రామస్వామి ఆరోగ్య పరిస్థితిని గూర్చి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ భరత్ దృష్టికి తీసుకురావడంతో..గత నెల ఆగస్టు 24న ఎంపీ కార్యాలయానికి వచ్చిన రామస్వామి ఆరోగ్య పరిస్థితిని వివరించాడు. 'రామస్వామి.. డోన్ట్ వర్రీ' అంటూ ఎంపీ భరత్ మనోధైర్యం చెప్పారు. కిడ్నీ మార్పిడికి సంబంధించి ఆపరేషన్ కు రెవెన్యూ శాఖ అధికారుల నుండి అనుమతి పత్రం కావాలని రామస్వామి చెప్పడంతో వెంటనే ఆర్డీవో, తహసీల్దారు తో ఎంపీ భరత్ మాట్లాడారు. వెంటనే ఆ సర్టిఫికెట్ ఇమ్మని మరీమరీ చెప్పారు. దాదాపు మూడు వారాలవుతోంది. ఆపరేషన్ కు అవసరమైన సర్టిఫికేట్ మాత్రం తహసీల్దారు ఇవ్వలేదు. తిరిగి తిరిగి రామస్వామి, ఆయన కుటుంబ సభ్యులు అలసిపోయారు. చివరికి ఆరోగ్యం క్షీణించి రామస్వామి మృత్యువాతపడ్డాడు. మంగళవారం అతను మృతిచెందాడు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు, కన్నతల్లి ఆక్రందనలతో మిన్నంటింది. నగరంలోని సీటీఆర్ఐ వద్ద సుబ్బారావు నగర్ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో గల రామస్వామి ఇంటి పరిసరాలలో విషాదం అలుముకుంది. విషయం తెలిసిన ఎంపీ భరత్ హుటాహుటిన రామస్వామి ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చడం ఆయన తరం కాలేదు. ఆపరేషన్ అవ్వలేదా అని ఎంపీ భరత్ రామస్వామి కుటుంబ సభ్యులను అడిగారు. అవ్వలేదు సార్..ఆపరేషన్ కు అవసరమైన సర్టిఫికేట్ తహసీల్దారు ఇవ్వలేదని చెప్పారు. అదేంటి..నేను చెప్పానే..ఇస్తానని చెప్పి..ఇంత జాప్యం ఎందుకు చేశాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజమండ్రి అర్బన్ తహసీల్దారు సుస్వాగతంకు ఎంపీ భరత్ స్వయంగా ఫోన్ చేసినా స్పందించలేదు.
ఆ అధికారిని సస్పెండ్ చేయండి..
వెంటనే ఆర్డీవోకు ఎంపీ ఫోన్ చేశారు. జరిగిన విషయాన్ని.. సదరు తహసీల్దారు విధి నిర్వహణలో చూపిన నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన పొరపాటు చిన్నదేమీ కాదని, వెంటనే సస్పెండ్ చేయమని రెవెన్యూ అధికారికి విజ్ఞప్తి చేశారు. కిడ్నీ ఆపరేషన్ కు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా మేము చేసినా..తహసీల్దారు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల తీవ్ర జాప్యమై..రామస్వామి మృతిచెందాడని..దీనికి సదరు అధికారి ఏమి సమాధానం చెబుతారని ఎంపీ భరత్ సీరియస్ గా ప్రశ్నించారు. లోక్సభ సభ్యుడిని నేను చెప్పినా లెక్క చేయలేదంటే..ఇక ఆ అధికారి ఎవరినీ లెక్కచేయడని..అటువంటి వారివల్ల ప్రజలకు ఫలితం మాట అటుంచి తీవ్ర నష్టాలే మిగులుతాయని ఎంపీ ఆగ్రహంతో ఆవేదన వ్యక్తం చేశారు. నేను స్వయంగా రాసిస్తా..ఆ తహసీల్దారును సస్పెండ్ చేయండని ఆర్డీవోకు ఎంపీ భరత్ కోరారు. అనంతరం రామస్వామి భౌతికకాయాన్ని సందర్శించి, ఘన నివాళులర్పించారు.
[zombify_post]