in ,

రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తగినంత బొగ్గు నివ్వటం మన బాధ్యత

రోజుకు 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.05లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయాలి

పెరుగుతున్న బొగ్గు ఉత్పత్తి
ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 720లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సిందే
మొదటి ఐదు నెలల కాలంలో  ఐదు ఏరియాల పనితీరు చాలా బాగుంది
మిగిలిన ఏరియాలు కూడా పుంజుకోవాలి
ఏరియాల జీఎంల సమీక్ష సమావేశంలో సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్. శ్రీధర్
సత్తుపల్లి, వార్త గురు న్యూస్:
రాష్ట్ర విద్యుత్ అవసరాలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించటం ఒక బృహత్తర బాధ్యతగా భావించి వచ్చే మార్చి చివరి కల్లా 720లక్షల టన్నుల ఉత్పత్తి ని సాధించి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాలని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మొదటి ఐదు నెలల కాలంలో మెరుగైన బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించి నిర్దేశిత లక్ష్యసాధన దిశగా ముందుకెళ్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు.  రానున్న ఏడు నెలల కాలంలో ప్రతి ఏరియా తనకు ఇవ్వబడిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలన్నారు. మొత్తం 12ఏరియాల్లో కొత్తగూడెం, మణుగూరు, రామగుండం-1, రామగుండం-2, రామగుండం-3 ఏరియాల పనితీరు బాగుందని ప్రశంసించారు. అలాగే ఇతర ఏరియాలు కూడా లక్ష్యాల మేర ఉత్పత్తి సాధించాలని ఆదేశించారు. కొన్ని గనుల్లో మరింత ఉత్పత్తికి అవకాశం ఉన్నందున దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అన్ని ఏరియాలలో ఓవర్ బర్డెన్ కు సంబంధించిన కాంట్రాక్ట్ లను ఖరారు చేయడం జరిగిందని, కాంట్రాక్టర్ల నుండి లక్ష్యాల మేర ఓబీ తొలగింపుకు ఏరియాలో జనరల్ మేనేజర్లు మరింత శ్రద్ధ చూపాలన్నారు. సెప్టెంబరు నెలలో  రోజుకు 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.05లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గు రవాణా చేయాలని ఆదేశించారు. అలాగే 14.5లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించడానికి వీలుగా ఓబీ కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఓబీ లక్ష్యాలపై ప్రణాళిక బద్ధంగా ముందుకు పోవాలన్నారు. ప్రస్తుతం అడపా దడపా వర్షాల వల్ల ఉత్పత్తికి కొంత ఆటకం అయినప్పటికీ గనుల్లో నిలిచి ఉన్న  నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉత్పత్తికి విఘాతం లేకుండా చూడాలన్నారు.  
సింగరేణి ఉద్యోగులకు నెల రోజుల్లో 1726కోట్ల రూపాయల వేజ్ బోర్డు ఎరియర్స్, ఆ వెంటనే లాభాల వాటా రూ.700కోట్లు, దీపావళి బోనస్ మరో 300కోట్ల రూపాయలు చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. మొత్తం మీద దాదాపు రూ.2800కోట్ల వరకు చెల్లింపులు చేయనున్నామని వెల్లడించారు. సగటున ఒక్కో కార్మికుడికి సుమారు రూ.6.5లక్షలు అందుకోనున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లోనూ  ఐక్యంగా రక్షణతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలు సాధించేలా వారిని చైతన్య పరచాలని, ఒకేసారిగా పెద్ద మొత్తంలో లభించే కష్టార్జిత సొమ్మును పొదుపుగా ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
సమావేశంలో డైరెక్టర్లు ఎన్.బలరామ్ (పర్సనల్, ఫైనాన్స్), డి.సత్యనారాయణ (ఈ అండ్ ఎం), ఎన్.వి.కె. శ్రీనివాస్ (ఆపరేషన్స్), జి.వెంకటేశ్వర్ రెడ్డి (పి అండ్ పి), అడ్వైజర్లు డి.ఎన్.ప్రసాద్(మైనింగ్), సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఈడీ(కోల్ మూమెంట్), జె.అల్విన్, జీఎం(కోఆర్డినేషన్) ఎం.సురేష్, జీఎం(సీపీపీ) జక్కం రమేష్,  జీఎం(ఎంపీ) మల్లెల సుబ్బారావు, జీఎం(మార్కెటింగ్) జి.దేవేందర్, జీఎం(సీఎంసీ) మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

నటకేసరికి ఘన నివాళి

చొప్పదండి బిఆర్ఎస్ పార్టీ యూత్ జనరల్ సెక్రటరీగా సువిన్ యాదవ్