విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం భారీగా దొంగ ఓట్లను గుర్తించినట్టు వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ స్పందించారు. 27 లక్షల దొంగ ఓట్లు వైసీపీవేనా అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు.ఈ ఓట్లతోనే వైఎస్ జగన్ 175కి 175 సీట్లు తమవే అని ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. 'మా ఓటర్లు వేరే ఉన్నారు అంటే ఏంటో అనుకున్నాము. ఎన్నికల సంఘం 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పింది. వీరేనా మీ ఓటర్లు జగన్ గారు?. ఓహో ఈ ధైర్యంతోనేనా 175/175 సీట్లు మావే అనే ప్రగల్బాలు. రాష్ట్రంలో జీరో హౌస్ నెంబర్ తో 2,51,767 ఓట్లు నమోదు. ఒకే డోర్ నెంబర్ తో 10 ఓట్లకు పైగా ఉన్న ఇళ్లు 1,57,939. ఒకే డోర్ నెంబర్ తో ఉన్న ఓట్లు 24,61,676 ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని,అధికారులపై అజమాయిషీ చేస్తూ, సాంకేతికంగా ఎక్కడా దొరక్కుండా, వాలంటీర్ల సహాయంతో పేర్లలో చిన్న చిన్న మార్పులు చేస్తూ అతి పెద్ద మోసానికి తెర లేపారు' అని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక అలజడి సృష్టించి ప్రజలందరు ఆ గొడవలో ఉంటే, మీరు మాత్రం దొంగ ఓట్లు సృష్టించడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. 'నియోజకవర్గాల వారీగా దొంగ ఓటర్ల లెక్కలు బయటపడాలి. దొంగ ఓటర్లతో పాటు వాటిని ప్రోత్సహించిన వారికి, సహకరించిన వారికి కూడా శిక్షలు పడాలి. అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఇక ఈ రాష్ట్రంలో వైకాపా కు చెల్లుచీటి పడిపోయింది. ఈరోజు నుంచి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది' అని గంటా ట్వీట్ చేశారు. కాగా,చంద్రబాబునాయుడికి మద్దతుగా గంటా నేడు ఒకరోజు దీక్షను ఆయన స్వగృహంలో చేపట్టారు.. ఈ దీక్షలు పెద్ద సంఖ్యలో టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు..
[zombify_post]