కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కొరత లేదని పట్టభద్రుల శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల తహసిల్ చౌరస్తాలో గత పది రోజులుగా జరుగుతున్న సమగ్ర శిక్ష సిబ్బంది నిరసన దీక్ష శిబిరానికి బుధవారం ఆయన హాజరై తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సమగ్ర శిక్ష సిబ్బంది ఉద్యోగ క్రమబద్ధీకరణ న్యాయ సమ్మతమైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 65 వేల కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ ప్రస్తుతం నాలుగు లక్షల కోట్లకు చేరుతుందని అన్నారు. దీనికి అనుగుణంగా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలు కూడా అదే తరహాలో కనీసం ఐదు రెట్లు పెరగాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ప్రస్తుతం కాంటాక్ట్ పద్ధతిలో సేవలందిస్తున్న సమగ్ర శిక్ష సిబ్బంది క్రమబద్ధీకరణకు బడ్జెట్ కొరత లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తో మిళితమై ఉందన్న సాకుతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం తండ్రి లాంటిది అయితే, రాష్ట్ర ప్రభుత్వం తల్లి లాంటిదన్నారు. తండ్రి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే తల్లి తన బాధ్యతను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వాల బాధ్యత కాగా, ప్రజల హక్కు అని పేర్కొన్నారు. విద్యా హక్కు లో భాగంగా పాఠశాలలో విద్యార్థుల చేరిక నుంచి సదుపాయాల కల్పన, విద్యాశాఖ పరిపాలనలో వారధిగా పనిచేస్తున్న సిబ్బంది సేవలను గుర్తించి వారి విధుల్లో క్రమబద్ధీకరించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను వ్యక్తిగతంగా లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తదుపరి కర్తవ్యాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు బండ శంకర్ హాజరయ్యారు. కాగా ఈ దీక్ష శిబిరానికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ గౌరవ అధ్యక్షులు చందా సత్యనారాయణ, స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రంగ శ్రీనివాస్, మేడిపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అల్లాడి శ్రీనివాస్ హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బర్ల నారాయణ, కుడుకల రవీందర్, ఉపాధ్యక్షులు నీరటి అంజయ్య, ఫారుక్, చిట్యాల రవి, బొడ్డు సురేష్, వివిధ మండలాల సమగ్ర శిక్ష సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]