రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) ఆధ్వర్యంలో కొవ్వూరు టౌన్ గోదావరి గట్టుపై నియో కాన్సెప్ట్ కెథడ్రల్ చర్చ లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… అందరి మత విశ్వాసాలను తాము గౌరవిస్తానని, ఈ రోజు రాష్ట్ర హోంమంత్రిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ఈ దేవుని చల్లని దీవెనలే కారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ మైనార్టీలందరూ ఐక్యతతోనే అభివృద్ధి సాధించగలమనే విషయాన్ని గుర్తించి సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. కైస్తవుల సమస్యలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. క్రైస్తవ కమ్యూనిటీహాల్ లకు సంబంధించిన స్థల సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలో అందరి ఆమోదంతో అనువైన స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిస్టియన్, మైనారిటీలకు రక్షణ, భద్రత కోసం తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్రైస్తవులందరూ కలిసి విజయవాడలో నిర్వహించే భారీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని తెలిపారు. 2019 ఎన్నికల్లో తమ గెలుపు కోసం కృషి చేసినట్లే 2024 ఎన్నికల్లోను కృషి చేయాలని దైవజనులను ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి, జడ్పీ వైస్ చైర్మన్ పోతిన శ్రీలేఖ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు డా. గెరా హనోకు,స్టేట్ ప్రెసిడెంట్ డా. కృపా సామ్యూల్, స్టేట్ సెక్రెటరీ రెవ.క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!