రాజకీయ దురుద్దేశంతోనే తెదేపా అధినేత చంద్రబాబును జైలుకు పంపారని నారా బ్రాహ్మణి ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో భువనేశ్వరితో పాటు బ్రాహ్మణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎన్నికల్లో లబ్ధికోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.
మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని మేం ఎప్పుడూ ఊహించలేదు. చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేతను జైల్లో పెట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? లక్షలాదిమంది యువతకు నైపుణ్యం మెరుగు పర్చేలా కృషి చేశారు. అభివృద్ధి, సంక్షేమం చేయడం నేరమా? ఉద్యోగాలు కల్పించడం నేరమా? ఇప్పుడున్న ప్రభుత్వం గంజాయి, లిక్కర్ ఇచ్చి యువత జీవితాలనునాశనం చేస్తోంది. చంద్రబాబు అరెస్టును దేశమంతా ఖండిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. జాతీయ నేతలు కూడా ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే కష్టపడేవారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న ప్రజలకు నా ధన్యవాదాలు. న్యాయవ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉంది అని బ్రాహ్మణి తెలిపారు.
[zombify_post]