ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దీర్ఘకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్న పలువురు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అగ్రిగోల్డ్ స్కాంలో బాధితులుగా మారిన కస్టమర్లు, ఏజెంట్ల అసోసియేషన్ ఛలో విజయవాడకు పిలుపునిచ్చింది. రేపు ఛలో విజయవాడ పేరుతో నగరానికి చేరుకుని జింఖానా మైదానంలో సభ నిర్వహించేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ నెల 15న అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన ఛలో విజయవాడపై డీసీపీ విశాల్ గున్నీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఆయన.. అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన ఛలో విజయవాడకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. అలాగే జింఖానా మైదానంలో నిర్వహించే దీక్షకు సైతం అనుమతి లేదన్నారు. అనుమతి ఉందంటూ అగ్రిగోల్డ్ బాధితులు చెప్తున్న దాంట్లో నిజం లేదన్నారు. ఎవరూ విజయవాడకు తరలిరావొద్దన్నారు.
*విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల ఛలో విజయవాడ నేపథ్యంలో పలు ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ జిల్లాలో సెక్షన్ 144 తో పాటు పోలీస్ యాక్ట్ లోని సెక్షన్ 30 కింద కూడా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. వీటిని ఉల్లంఘించి ఎవరైనా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని, కేసులు నమోదు చేస్తామని డీసీపీ విశాల్ గున్నీ తెలిపారు. శాంతి భద్రతలు, ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు.
మరోవైపు అగ్రిగోల్డ్ బాధితుకు న్యాయం చేస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయినా ఇప్పటివరకూ తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బాధితుల సంఘం ఛలో విజయవాడకు పిలుపునిచ్చింది. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితులు ఛలో విజయవాడ నిర్వహణ ఉత్కంఠ రేపుతోంది. గతంలోనూ పలుమార్లు ఆంక్షలు ఉల్లంఘించి అగ్రిగోల్డ్ బాథితులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించిన ఘటనలు ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

[zombify_post]