నర్సీపట్నం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారని, దీన్ని నివారణలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఆరోపించారు. శుక్రవారం ఆయన గొలుగొండలో మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలోని ఉన్న నాలుగు మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలతో మంచాన పడ్డారన్నారు. ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాలతో బాధపడుతున్నారన్నారు. గొలుగొండ మండలంలోని పలు గ్రామాల్లో డెంగ్యూ జ్వరాలు అధికం ఉన్నాయని చెప్పారు. పీహెచ్ సిల్లో డెంగ్యూ నిర్ధారణ కేంద్రాలు లేకపోవడం వల్ల ప్రజలు నర్సీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతీ పిహెచ్ సిలో డెంగ్యూ నిర్ధారణ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయడంతో పాటు డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు, మండల సీనియర్ నాయకులు రేగుబళ్ల శివ, మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ బాబు, నాయకులు వాసం వెంకటేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి, నియోజకవర్గ ఎస్సీ సెల్ కన్వీనర్ డాక్టర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!