Razakar Teaser: మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ఒక్కో పార్టీ ఒక్కో ఎత్తుగడ వేస్తుంది. అధికారం దక్కించుకునే క్రమంలో కొన్ని పార్టీలు సంచలనాలకి తెరలేపుతున్నాయి.పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో కశ్మీర్ ఫైల్స్ సినిమాను తీసుకు వచ్చిన బీజేపీ ప్రభుత్వం… కర్నాటక ఎన్నికల్లో కేరళ స్టోరీని దింపడం మనం చూశాం. అయితే మరి కొద్ది నెలలో తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రజాకార్ అంటూ ముస్లింలని టార్గెట్ చేస్తూ ఓ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాకి గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ చేయగా, ఈ టీజర్ ఇప్పుడు వివాదానికి తెరలేపేలా ఉంది.

భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల ప్రజలకు ఎప్పుడు వచ్చిందటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతాలు స్వాతంత్య్రం కోసం ఎన్నో పోరాటాలు చేశాయి. అయితే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17 కథా వస్తువుగా మారింది. ఆ రోజు జరిగిన విముక్తి పోరాటం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్టు దర్శకుడు నారాయణ అన్నారు. అయితే రజాకార్ టీజర్‌లో ముస్లింలని పెద్ద నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేశారు. దీనిపై మత పెద్దలు, రాజకీయ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని చరిత్రను వక్రీకరించి సినిమాను తీశారని, రాజకీయం కోసం ఇలా తప్పుడు సినిమాలు తీయోద్దంటూ హెచ్చరిస్తున్నారు.
తాజాగా చిత్ర టీజర్‌పై మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తెలివితక్కువ బీజేపీ జోకర్లు.. వారి వారి స్వార్థ రాజకీయాల కోసం.. తెలంగాణలో మత విద్వేషాలు సృష్టించాలని ఎంతో ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. రజాకార్ టీజర్ చూస్తే ఇది క్లియర్‌గా అర్ధమైంది. దీనిని తప్పనిసరిగా తాము సెన్సార్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ పోలీస్‌లు కూడా లా అండ్ ఆర్డర్ పరిస్థితి దెబ్బతినకుండా చూసుకోవాలంటూ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అయితే రాజకీయాలకోసం శాంతియుతంగా ఉన్న తెలంగాణ సమాజంలో మతఘర్షణలు పెరిగిపోయే అవకాశం ఉందని కూడా కొందరు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.