విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం నుండి కేంద్ర బిజెపి ప్రభుత్వం వెనుక్కు తగ్గేవరకు ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం పార్టీ శ్రేణులకు, ప్రజలకు, కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. సిపిఎం విశాఖ జిల్లా ప్లీనం సమావేశం ఆదివారం డాబాగార్డెన్స్‌లో ఉన్న అల్లూరి సీతారామారాజు విజ్ఞాన కేంద్రంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి లోకనాధం ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ దూకుడును వేగవంతం చేసిందన్నారు. అందులో భాగమే స్టీల్‌ప్లాంట్‌ను అమ్ముతున్నట్లు గత రెండేళ్ళ క్రితం ప్రకటించిందన్నారు. ప్లాంట్ రక్షణకోసం సిపిఎం పార్టీ అనేక రూపాల్లో పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. అలాగే గత వెయ్యి రోజులుగా ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ప్రజలు పెద్దఎత్తున పోరాడుతున్నా బిజెపి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవటం లేదని ఎద్దేవాచేశారు. ఆంధ్రరాష్ట్రానికి ఏకైక భారీ పరిశ్రమను అమ్మేయడానికి బిజెపి సిద్దపడుతుంటే రాష్ట్ర వైసిపి ప్రభుత్వం, ప్రతిపక్ష టిడిపి, జనసేనలు మాత్రం బిజెపి నిర్ణయణాన్ని గట్టిగా తిప్పికొట్టకపోవడం హేయమైన చర్య. గంగవరంపోర్టు, కృష్ణపట్నం పోర్టు, రైల్వే, విశాఖపట్నం పోర్టు, రక్షణరంగం వంటి ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలన్నీ అంబానీ, అధానీకి కట్టబెడుతుంటే వాటిని కాపాడకుండా బిజెపికి వంతపాడటం శోచనీయమన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపిని టిడిపి, వైసిపి, జనసేన పల్లెత్తుమాటాడకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. దేశంలో బిజెపిని ఓడిరచేందుకు ఇండియా కూటమి ఏర్పడినా దానిలో కూడా ఈ పార్టీలు చేరలేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అరెస్టుతో రాజకీయవేడి పెరిగిందన్నారు. రాష్ట్ర వైసిపి ప్రభుత్వం ప్రజాఉద్యమాలపైన, నాయకులపై ఉక్కుపాదం మోపుతోందని, ప్రతిపక్ష పార్టీలపై నిర్భంధాలు ప్రయోగిస్తుందన్నారు. చంద్రబాబు అరెస్టు చేసే విధానాన్ని సిపిఎం పార్టీ ఖండించిందన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే విధంగా రాజకీయ వాతావరణాన్ని సృష్టించాయని ఇది చాలా ప్రమాదకరమన్నారు. ఈ నేపధ్యంలో మన పార్టీ ప్రజా సమస్యలపై అక్టోబర్‌లో బస్ యాత్ర నిర్వహించి నవంబరు 7న విజయవాడలో లక్షలాదిమందితో సభ పెడుతుందన్నారు. సిపిఎం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలను సమీకరించాలని పిలుపునిచ్చారు.
సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల బైక్‌యాత్రను వివరించారు. 20న విశాఖ జివిఎంసి వద్ద ప్రారంభించి విజయనగరం, శ్రీకాకుళం, మన్యంపార్వతీపురం, అరుకు, పాడేరు, అనకాపల్లి మీదుగా కూర్మన్నపాలెం చేరుకుంటుందన్నారు. దీనికి ఉపజాతాగా 21న మద్దిలపాలెంలో ప్రారంభమై జగదాంబ, అక్కయ్యపాలెం, కంచరపాలెం, మల్కాపురం, గాజువాక, స్టీల్, గోపాలపట్నం, పెందుర్తి, ఆరిలోవ, మధురవాడ వరకు ఒక జాతా, భీమిలిలో ఒక జాతా 26వరకు తిరుగుతుందన్నారు. స్టీల్‌ప్లాంట్ రక్షణకోసం జరిగే ఈ యాత్రలో ప్రజలను, కార్మికులను, యువతీ, యువకులు, మహిళలను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయాలన్నారు. 29న జరిగే సభకు వేలాదిమందిని సమీకరించాలన్నారు.
ఈ ప్లీనం సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.పద్మ, బొట్టా ఈశ్వరమ్మ, డా॥బి.గంగారావు, కె.ఎం.శ్రీనివాస్, బి.జగన్‌లు స్టీరింగ్ కమిటీగా వ్యవహరించారు.
[zombify_post]