విశాఖ స్టీల్‌ప్లాంట్ రక్షణకై సిపిఎం పార్టీ గత 11 రోజుల నుండి వందలాది మందితో ఉత్తరాంధ్రలో బైక్‌యాత్ర జయప్రదంగా సాగుతున్నది. ఈ యాత్ర విశాఖలో జరుగుతున్నది. ఈ యాత్ర ముగింపు సందర్భంగా అక్టోబరు 5వ తేదీన విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ (కూర్మన్నపాలెం జంక్షన్) వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు ముఖ్యవక్తగా సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతున్నారని, ఈ సభలో కార్మికులు, ప్రజలు కుటుంబాలతో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సి.హెచ్.నర్సింగరావు విజ్ఞప్తి చేసారు. శుక్రవారం జగదాంబ జంక్షన్‌లో ఉన్న నండూరి ప్రసాదరావు భవనంలో సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ప్రెస్‌మీట్ నిర్వహించింది. అక్టోబరు 5న జరిగే బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు.బిజెపి నాయకులు జివిఎల్ నర్సింహరావు విశాఖస్టీల్‌ప్లాంట్‌కు పూర్వవైభవం తెస్తామని ఇటీవల ప్రకటించారు. ఇందులో వాస్తవమెంత?. విశాఖస్టీల్‌ప్లాంట్‌ను ముంచుతున్నది మీ కేంద్ర బిజెపి ప్రభుత్వం కాదా? విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుతామని స్టీల్ మంత్రితో పార్లమెంట్‌లో ప్రకటించే ధైర్యం జివిఎల్‌కు వుందా? అని సి.హెచ్.నర్సింగరావు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ 2020 జనవరి నుండి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను స్టేటజిక్‌సేల్ పేరుతో నూరుశాతం అమ్మాలని శతవిధాలా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అది సాధ్యంకాలేదు. స్టీల్‌ప్లాంట్‌ను విలువకట్టే కమిటీలు స్టీల్‌ప్లాంట్‌లోకి వచ్చి విలువను అంచనా వేయలేకపోయాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల పోరాటం వల్ల బిజెపి వెనక్కుతగ్గాల్సి వచ్చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను బలహీనం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. విశాఖస్టీల్‌ప్లాంట్ ఉత్పత్తిని 40శాతం తగ్గించి రూ॥ 3900 కోట్లు గత సంవత్సరం నష్టాలు రావటానికి కేంద్ర బిజెపి ప్రభుత్వమే కారణం. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్‌లకు లాభాలు వచ్చాయి. నాణ్యమైన స్టీల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న విశాఖ స్టీల్‌కు ఎందుకు నష్టాలొచ్చాయి?. ముడిఖనిజం రాకుండా అదానీని అడ్డుపెట్టుకున్నారు. ఎన్‌ఎండిసి నుండి ముడిఖనిజం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నది. బ్లాస్ట్‌ఫర్నేస్ `3 ను జిందాల్ స్టీల్‌కు అప్పగించడానికి నేడు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో బి.ఎస్.ఎన్.ఎల్‌ను బలహీనపర్చి రిలియన్స్‌కు అప్పగించింది. విశాఖ స్టీల్‌ను జిందాల్, పోస్కో (దక్షిణకొరియా) లకు అప్పగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇది పూర్వవైభవమా? అని బిజెపి నాయకులు జివిఎల్‌ను ప్రశ్నించారు.
సిపిఎం పార్టీ ప్రభుత్వరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేసింది. దేశంలో గత 75ఏళ్ళలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి కేంద్ర ప్రభుత్వరంగం సోవియట్ యూనియన్ మరియు ఇతర సోషలిస్టుదేశాల సహాయంతో ఎంతో అభివృద్ధిని సాధించాయి. బిజెపి కేంద్ర ప్రభుత్వం నేడు విశాఖ స్టీల్, రైల్వే, విద్యుత్, పెట్రోలియంలాంటి కీలకరంగాలతో సహా మొత్తం ప్రభుత్వరంగాన్ని అమ్మేస్తాం లేదా మూసేస్తామన్న విధానాన్ని ప్రకటించి అమలు చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో సిపిఎం పార్టీ అగ్రభాగాన ఉండి పోరాడుతున్నది. దేశంలో సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా 1991 నుండి జరిగిన 21 సమ్మెలకు సిపిఎం మద్దతిచ్చింది. గతంలో మూడు వామపక్షప్రభుత్వాలు, నేడు కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రతీ పోరాటాన్ని ప్రోత్సహిస్తున్నది. 2014ఎన్నికల్లో మోడీ ఏడాదికి క్టోఇ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఉన్న ఉద్యోగాలు తీసేసారు. గత పదేళ్ళలో కొత్తగా రిక్రూట్‌మెంట్ లేదు. పైగా విఆర్‌ఎస్ పధకాన్ని తెచ్చి ఉద్యోగులను బలవంతంగా బయటకు నెట్టింది. ధరలు భారీగా పెంచి భారాలు వేస్తున్నారు. ఉన్న ప్రభుత్వరంగ సంస్థలన్నీ అమ్మేస్తున్నారు.
అదానీ నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని విజయవాడ పేలస్‌లో కలవడంలో ఆంతర్యమేమిటి?. ఆంధ్రప్రదేశ్‌లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట (భావనపాడు) పోర్టులను ఆదానీకి అప్పగించడానికి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధపడుతున్నది. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఆరు కోపరేటీవ్ షుగరు ఫ్యాక్టరీలు మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చడానికి, విద్యుత్ స్మార్ట్ మీటర్లును బిగించి పంపిణీ విభాగాన్ని పూర్తిగా అదానీకి అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకై సిపిఎం చేపట్టే ఉత్తరాంధ్ర బైక్‌యాత్రకు ప్రజలు, కార్మికులు బ్రహ్మరధం పడుతున్నారు. విశాఖలో గత రెండురోజులుగా ఈ యాత్ర సాగుతోంది. అక్టోబరు 5న బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుందన్నారు. గత 950 రోజులు స్టీల్ కార్మికులు, ప్రజలు పోరాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఈ పోరాటంలో చిత్తశుద్ధితో పాల్గొనకపోగా కేంద్ర బిజెపికి దాసోహమైపోయాయన్నారు. ఈ మూడు పార్టీల వైఖరి మార్చుకొని ప్లాంట్ పరిరక్షణకోసం, ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలకోసం నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, పబ్లిక్‌సెక్టార్ కన్వీనర్ ఎస్.జ్యోతీశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!