కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు. తొమ్మిది కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 16 నుంచి 12 గంటల సమయం పడుతోంది.భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. శనివారం 66,590 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,052 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. టీటీడీకి హుండీ ద్వారా 3.37 కోట్ల రూపాయల ఆదాయం అందింది.సోమవారం నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతోన్నాయి. కన్నులపండువగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోన్నారు టీటీడీ అధికారులు. ఈ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టనుంది టీటీడీ.ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ సుమారు లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు తిరుపతి, తిరుమలకు విచ్చేసే అవకాశం ఉందని, వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను కోరారు.
భక్తుల సౌకర్యాల విషయంలో ఎలాంటి అజాగ్రత్త గానీ, నిర్లక్ష్యం గానీ ప్రదర్శించవద్దని సూచించారు. 1,400 బస్సులను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు వివరించారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవ నాడు 2,600 సర్వీసులు అందుబాటులో తీసుకురానున్నట్లు చెప్పారు.
[zombify_post]