– మల్లెనవారి పేట లో మూడు ఎలుగుబంట్ల హల్చల్
– సిగల పుట్టుగ గ్రామదేవత ఆలయంలోకి చొరబడిన ఎలుగుబంటి
– అటవీ శాఖ అధికారులు రక్షణాత్మక చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్

పలాస నియోజకవర్గంలోని ఉద్దాన ప్రాంత ప్రజలకు ఒకవైపు కిడ్నీ మహమ్మారి పీడిస్తుంటే మరోవైపు ఎలుగుబంట్లు బెడద ఆందోళన కలిగిస్తుంది. మందస మండలం లోని మల్లెన వారి పేట లో ఇటీవల ఏకంగా మూడు ఎలుగుబంట్లు గ్రామంలోకి చొరబడి ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసాయి. రాత్రిపూట గ్రామంలో గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు సిగల పుట్టుగ గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. రాత్రిపూట గ్రామదేవత ఆలయంలోకి చొరబడి నానా హంగామా చేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గుడిలో దీపాలు వెలిగించుటకు గాను ఉంచిన నూనె తాగి,ప్రసాదాలు తిని హంగామా చేసింది. ఎప్పుడు ఎవరి పైన దాడి చేస్తుందోనని ప్రజలు భయంతో వణికి పోతున్నారు.గతంలో మందస, వజ్రపు కొత్తూరు మండలంలో కూడా ఎంతోమంది ఎలుగుబంట్లు దాడికి గురై క్షతగాత్రులయ్యారు. కొంతమంది మరణించడం కూడా జరిగింది.ఇంత జరుగుతున్న అటవీశాఖ అధికారులు కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారే తప్ప నివారణ మార్గాలు అన్వేషించడం లేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.అసలు ఎలుగుబంట్ల నివారణ సాధ్యపడేనా అనే ప్రశ్న ఉద్దాన ప్రాంత ప్రజల మదిలో తలెత్తుతుంది. ఎలుగులు గ్రామాలలోకి,తోటల్లోకి రాకుండా అటవీశాఖ అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎలుగుబంట్లను బంధించి సుదూర ప్రాంత అడవులలో విడిచి పెట్టడం గాని , జూకు తరలించడం గాని చేయాలని ఉద్దాన ప్రజలు కోరుతున్నారు.ఎలుగు దాడిలో గాయాలు,మృతి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఎలుగు దాడుల్లో మృతి చెందిన,గాయాల పాలైన క్షతగాత్రులకు ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
[zombify_post]