Srisailam | వినాయక చవితి సందర్భంగా శ్రీశైల మహా క్షేత్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.
Srisailam | శ్రీశైలంలో వినాయక చవితి సందర్భంగా లోక కల్యాణం కోసం గణపతి నవరాత్రోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం యాగశాల ప్రవేశం, శివ సంకల్పం, కంకణ పూజ, ఋత్విగ్వరణం, కంకణాధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందు స్థానాచార్యులు, అర్చక స్వాములు, వేద పండితులు, అధికారులు సంప్రదాయ బద్ధంగా ఆలయ ప్రాంగణంలో స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.
ఈ నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు ఆలయ ప్రాంగణంలోని రత్న గర్భ గణపతి స్వామికి, సాక్షి గణపతి ఆలయంలోని స్వామి వారికి, సాక్షి గణపతి ఆలయంలో నెలకొల్పిన వర సిద్ధి వినాయక స్వామి (మృత్తికా గణపతి స్వామి) వారికి యాగశాలలో వేంచేబు చేయించిన కాంస్య గణపతి మూర్తికి విశేషంగా పూజాధికాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం పూర్ణాహుతి, అవబృథ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
ఆలయ ప్రవేశం చేసిన తర్వాత వేద పండితులు, వేద పారాయణం చేసి వేదస్వస్తి నిర్వహించారు. వేద పఠనం పూర్తి కాగానే స్థానాచార్యులు లోక క్షేమాన్ని కాంక్షిస్తూ నవ రాత్రి ఉత్సవ సంకల్పం పఠించారు. దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీతయాలు సంభవించకుండా, సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు సంభవించకుండా చూడాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు సంకల్ప పఠనం చేశారు. పుణ్యాహవచనం తర్వాత కంకణాలకు (రక్షా బంధనాలకు) శాస్త్రోక్తంగా పూజాధికాలు జరిపించారు. తర్వాత కంకణ ధారణ కార్యక్రమం నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా ఋత్విగ్వరణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఆయా వైదిక కార్యక్రమాలను నిర్వహించాలని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షా వస్త్రాలు అందచేసే కార్యక్రమాన్నే ఋత్విగ్వరణం అని పిలుస్తారు. ఋత్విగ్వరణం తర్వాత అఖండ దీప స్థాపన, వాస్తుహోమం జరిపించారు. వాస్తు హోమం తర్వాత మండప ఆరాధన చేసి గణపతి కలశ స్థాపన చేశారు. కలశ స్థాపన తర్వాత కలశార్చన నిర్వహించారు. లోకకల్యాణం కోసం జపానుష్ఠానాలు చేశారు.
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు సాయంత్రం జరిగే అంకురార్పణకు ఎంతో విశేషం ఉంది. ఆలయ ప్రాంగణంలో నిర్ణీత పునీత ప్రదేశంలో మట్టి సేకరించి యాగశాలకు తీసుకొస్తారు. దీన్నే `మృత్సంగ్రహణం అంటారు. తర్వాత ఈ మట్టిని తొమ్మిది పాలికల్లో మూకుళ్లలో నింపి, దాంట్లో నవధాన్యాలనను పోసి, వాటిని మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. పోలికలలో రోజూ నీరు పోసి నవ ధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు.
ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ యాగశాలలో మండపారాధనలు, జపానుష్ఠానాలు, గణపతి హోమం, పారాయణాలు, సాయంకాల హవనాలు జరిపిస్తారు. ఈ ఉత్సవాల్లో చివరి రోజు ఈ నెల 27 ఉదయం జరిగే పూర్ణహుతి, కలశోద్వాసన, అవబృధ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
రత్నగర్భ గణపతికి ప్రత్యేక పూజలు
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ ప్రాంగణంలోని రత్న గర్భగణపతి స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు జరిపించారు. ఉత్సవ సమయంలో ప్రతి రోజూ ఈ విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాక్షి గణపతి స్వామి వారికి ఉదయం అభిషేకం, విశేష అర్చనలు నిర్వహించారు. పంచామృతాలతోనూ, ఫలోదకాలతోనూ, శుద్ధ జలంతోనూ ఎంతో శాస్త్రోక్తంగా ఈ అభిషేకం నిర్వహించారు. ఉత్సవాల రోజుల్లో ప్రతి రోజు కూడా స్వామి వారికి విశేష పూజలు చేశారు.
గణపతి నవ రాత్రోత్సవాల సందర్భంగా సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేకంగా వరసిద్ధి వినాయక స్వామి (మృత్తికా గణపతి స్వామి)ని నెలకొల్పారు. ఉత్సవాల్లో భాగంగా వరసిద్ధి వినాయక స్వామి వారికి (మృత్తికా గణపతి వారికి) విశేషంగా పూజలు చేశారు. ఉత్సవాల్లో ప్రతి రోజూ కూడా వరసిద్ధి వినాయక స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు.
ఉచిత సామూహిక సేవలు
ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైల దేవస్థానం సోమవారం వినాయక చవితి సందర్భంగా ఉచిత సామూహిక సేవల్లో భాగంగా గణపత పూజ నిర్వహించారు. తెల్ల రేషన్ కార్డు గల వారి సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉచిత సామూహిక సేవల్లో భాగంగా సోమవారం చంద్రవతి కల్యాణ మండపంలో గణపతి పూజ నిర్వహించినట్లు శ్రీశైలం ఈవో ఎస్ లవన్న తెలిపారు.
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు