—కృష్ణార్జున్ బాలసాహిత్యాన్ని ఆవిష్కరించిన మువ్వా శ్రీనివాస్.
నేటితరం విద్యార్ధులు బడికి వచ్చే సమయానికే సామాజిక మాధ్యామాలలోని కాలుష్యాన్ని మనసులలో నింపుకొని వస్తున్నారని,వీటిని తొలగించి విలువలను అందించే బాలసాహిత్యాన్ని రాయాల్సిన బాధ్యత ఉపాధ్యాయ కవులు, రచయితలపై ఉందని ప్రముఖ కవి,విద్యావేత్త, జాషూవా సాహిత్య వేదిక అధ్యక్షులు మువ్వా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం స్థానిక కళాభారతిలో సృజన సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో రంగపురి కృష్ణార్జున్ రచించిన బాల సాహిత్యం చరితార్ధ శతకం, రజోత్సవ కధలు పుస్తకాలను మువ్వా శ్రీనివాస్ తోపాటు అతిధులు ఆవిష్కరించారు. మధుసూదన రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయులు విద్యను బోధిస్తే సరిపోయేదని వర్తమానంలో వస్తున్న విపరీత ధోరణులు పిల్లలపై ప్రభావం చూపుతున్న తరుణంలో విలువల విద్యను అందించాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉందని అన్నారు.కార్యక్రమంలో భాగంగా పుస్తకావిష్కరణల అనంతరం తొలి ప్రతులను కృష్ణార్జున్ తల్లిదండ్రులు కోటిరామ్మూర్తి,సుశీలకు,మిత్రుడు ఏవీ.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అంకితమిచ్చి వారిని ఘనంగా సత్కరించారు. చరితార్ధ శతకాన్ని కన్నెగంటి వెంకటయ్య, రజతోత్సవాన్ని చిమ్మపూడి కళ్యాణశర్మ పుస్తక సమీక్ష చేసారు. సమావేశంలో పాల్గొన్న పలువురు అతిధులు, సాహితీవేత్తలు మాట్లాడుతూ బాల సాహితీవేత్తగా కృష్ణార్జున్ సమాజానికి విలువైన సాహిత్యాన్ని అందచేశారని అన్నారు.సమష్టి కుటుంబ వ్యవస్థ కనుమరుగౌతున్న తరుణంలో ఇంటివద్ద పిల్లలను పట్టించుకునే వారు కరువౌతున్నారనీ, తల్లిదండ్రుల బాధ్యతలను కూడా పాఠశాలలో ఉపాధ్యాయులే నిర్వర్తించాల్సి వస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో దమ్మపేట మండల విద్యాధికారి లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు జగపతి, పద్మావతి, బాలసాహితీవేత్తలు వురిమళ్ళ సునంద, కన్నెగంటి వెంకటయ్య, కోండ్రు బ్రహ్మం, రంగపురి వెంకటేశ్వరరావు, సృజన నిర్వాహకులు మధుసూదనరాజు, జి.రామకృష్ణ, పసుపులేటి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పిడి,శ్రీనివాసరెడ్డి, కళ్యాణశర్మ, పిల్లి మల్లికార్జున రావు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా అతిధులను కృష్ణార్జున్, సుజాత దంపతులు శాలువా, జ్ఞాపిక, పూలమాలలతో సత్కరించారు. కవి కృష్ణార్జున్ ను సృజన, జాషూవా సాహిత్య వేదిక(ఖమ్మం),బాల సాహిత్య వేదిక(ఖమ్మం), సత్తుపల్లి, దమ్మపేట మండలాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.
[zombify_post]
