అనకాపల్లి జిల్లాలోని ఇసుక డిపోల్లో అమ్మకాలు ఆగిపోవడంతో అధికార పార్టీకి చెందిన ఇసుక మాఫియా రంగంలోకి దిగింది. వాస్తవంగా జిల్లాలో ఎక్కడా ఇసుక తవ్వకాలకు గనుల శాఖ అనుమతులు ఇవ్వలేదు. అయితే జగనన్న ఇళ్ల కాలనీలకు స్థానికంగా వున్న నదుల్లో నుంచి ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక తీసుకెళ్లడానికి ప్రభుత్వం మౌఖికంగా అనుమతులు ఇచ్చింది. దీనిని అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నేతలు ఇసుక దోపిడీకి దిగారు. జగనన్న కాలనీలకు, ప్రభుత్వ భవన నిర్మాణాలకు అంటూ సచివాలయాల నుంచి కూపన్లు తీసుకుంటున్నారు. చోడవరం మండలంలో గజపతినగరం, జుత్తాడ, గవరవరం, గౌరీపట్నం, దేవరాపల్లి మండలంలో తిమిరాం, కలిగొట్ల, వి.మాడుగుల మండలంలో వాడపాడు, సాగరం, ఎలమంచిలి, ఎస్.రాయవరం మండలాల సరిహద్దులో వరహా నదిలో ఇసుక తవ్వకాలు అధికంగా సాగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతూ, టైర్ బండ్లతో ఒడ్డుకు, సమీపంలోని ఖాళీ స్థలాల్లో చేరుస్తున్నారు. ఇక్కడి నుంచి ట్రాక్టర్లు, లారీల్లో లోడింగ్ చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.7 వేలు, లారీ అయితే రూ.15 వేలకు అమ్ముకుంటున్నారు. ఇదంతా మైనింగ్, రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ శాఖల అధికారులకు తెలిసినప్పటికీ, తెరవెనుక వున్నది అధికార పార్టీ నేతలు కావడంతో అడ్డుకోవడానికి, కేసులు నమోదు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు
జిల్లాలో ఎక్కడా ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. ప్రభుత్వ డిపోల్లో ఇసుక అమ్మకాలకు సంబంధించి జేపీ వెంచర్స్‌కు ఇచ్చిన గడువు ముగిసింది. జిల్లాలో ఇసుక అవసరాలకు విశాఖ నగర పరిధిలోని అగనంపూడి డిపో నుంచి ఇసుక తెచ్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
– సుబ్బారాయుడు, గనుల శాఖ ఏడీ, అనకాపల్లి
[zombify_post]