ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి సిరిమానోత్సవానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఈ ఏడాదీ పండగతో పాటే విజయనగరం ఉత్సవాలు నిర్వహించనున్నామన్నారు.
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి సిరిమానోత్సవానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఈ ఏడాదీ పండగతో పాటే విజయనగరం ఉత్సవాలు నిర్వహించనున్నామన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, గతంలో చోటుచేసుకున్న లోపాలు పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. 29న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నామని, ఈలోగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీ ప్రతినిధులు, జీవితకాల సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. సిరిమాను తిరగడం గతేడాది కొంత ఆలస్యమైందని, ఈసారి సమయపాలన తప్పనిసరి అని ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. వీఐపీలతో పాటు పెద్దసంఖ్యలో వారి అనుచరులు వస్తుండడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదని, ఆ పరిస్థితి లేకుండా చూడాలన్నారు. తప్పులు జరిగితే ప్రజాప్రతినిధులు, అధికారులే బాధ్యత వహించాల్సి వస్తోందన్నారు. సిరిమానును తీసుకొచ్చి, సిద్ధం చేసే ప్రక్రియలో అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎస్పీ దీపిక ఎం. పాటిల్, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయా యాదవ్, డీఆర్వో ఎస్.డి. అనిత, పైడితల్లి దేవస్థానం ఈవో సుధారాణి పాల్గొన్నారు
[zombify_post]