in , , ,

సెప్టెంబర్ 17..అది తెలంగాణ చరిత్రలో విస్మరించలేని రోజు:

సెప్టెంబర్ 17… అది తెలంగాణ చరిత్రలో విస్మరించలేని రోజు. 

  • విరుద్ధ శక్తులు సంఘర్షించి కోట్ల మంది భవితవ్యాన్ని నిర్దేశించిన రోజు.

  •  ఒకవైపు దొరల దోపిడీ, మరో వైపు నిజాం నిరంకుశ పాలన, అగని రజాకార్ల దురాగతాలు.. మరోవైపు.. వీటిపై తిరగబడిన కమ్యూనిస్టులు, వాళ్లకు అండగా నిలిచిన బీదాబిక్కీ. ఇంకోవైపు.. సైనిక బలగంతో హైదరాబాద్ సంస్థానాన్ని హస్తగతం చేసుకోడానికి ముట్టడించిన భారత సైన్యం! ఈ ముప్పేట యుద్ధం చివరికి సెప్టెంబర్ 17తో ముగిసింది. మరి ఆ యుద్ధానికి దారితీసిన పరిస్థితులేంటి? ఏది సత్యం? ఏది నిత్యం?

రక్తాక్షరాల సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, దాస్య శృంఖలాల విముక్తి కోసం జనం తిరగబడ్డారు. ప్రపంచ చరిత్రలోనే అరుదైన, చెరగని అధ్యాయం అది. 

రైతులు ఆయుధాలు అందుకున్నారు. కమ్యూనిస్టుతో చెయ్యి కలిపి కదం తొక్కారు. ఆనాడు పల్లెల్లో దొరల దోపిడీ తీవ్రంగా ఉండేది. భూములన్నీ వారివే. దీనికి విసునూర్ దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి ఉదంతం చక్కని ఉదాహరణ. వెట్టిచాకిరి చేయించుకోవడం, ఎదురుతిరిగిన వారిని అంతం చెయ్యడమే దొరల పని. దీనిపై యువత తిరగబడింది. గుత్పల సంఘం, వడిసెల సంఘం, కారంపొడి సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి దొడ్డి కొమురయ్య నాయకత్వం వహించాడు. సంఘం ర్యాలీ తీసింది. ర్యాలీ గడి వద్దకు రాగానే రజాకార్లు, దొర తాబేదార్లు కాల్పులు జరిపారు..దీంతో ముందు వరసలో ఉన్న దొడ్డి కొమురయ్య కడుపులో తూటా దిగింది.తెలంగాణ రైతాంగ పోరాటంలో తొలి అమరుడిగా చరిత్రకెక్కాడు.కొమురయ్య అమరత్వం అగ్గి రాజేసింది.

ఇదీ ముఖచిత్రం హైదరాబాద్ సంస్థానం 1948 ముందు వరకు ప్రత్యేక రాజ్యం.16 జిల్లాలు ఉండేవి. భాషా ప్రాతిపదికన వీటిని విభజించారు. తెలుగు మాట్లాడే వారివి 8 జిల్లాలు. మరాఠీ మాట్లాడే వారివి 5 జిల్లాలు. కన్నడ మాట్లాడే వారికి 3 జిల్లాలు ఉండేవి. నిజాం బ్రిటిష్ పాలకులకు సామంతుడిగా ఉండేవాడు. సంస్థానంలోని 2600 ఊర్లు నిజాం జాగిరు గ్రామాలే. మిగతావి జమీన్‌దార్, పటేల్, పట్వారీల ఆధీనంలో ఉండేవి. 

హైదారాబాద్ సంస్ధానంలో హేయమైన దోపిడికి జమీన్‌దార్, పటేల్, పట్వారీ వ్యవస్థే ప్రధాన కారణం. నిజాం విధించే పన్నులను దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు వసూలు చేసేవారు. దీని కోసం వీరు చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. భూమి శిస్తు వసూలు సందర్భంగా రైతులు పండించే పంటలో సంగం కంటే ఎక్కువ శిస్తు కింద జమ చేసుకునే వారు. జనం పన్నులు చెల్లించకుంటే భూమిని గుంజుకునేవారు. కౌలు రైతుల కష్టాలు అంతా ఇంతా కావు. కౌలు వసూలు కోసం రైతులను చిత్రహింసలు పేట్టేవారు. దొరల ఇంట్లో ఎవరైనా పుట్టినా, చచ్చినా పేదలు పన్నులు కట్టాల్సిందే. నిజాం కన్నా ఈ దొరల మీదనే ఎక్కువ వ్యతిరేకతను పెంచుకున్నారు..ఇది నాటి తెలంగాణ పరిస్ధితి.

ఇదంతా శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ. ఇదంతా ఒక ఎత్తైతే, సాంస్కృతిక, రాజకీయ పరమైన వివక్ష మరోవైపు హైదరాబాద్ సంస్థానంలో తెలుగు మాట్లాడేవారే ఎక్కువ. కాని పాలకుల భాష ఉర్దూనే అధికార బాష. తెలుగు మాట్లాడాలంటే భయపడాల్సిందే. చదువంతా ఉర్దూలోనే. సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే నిజాం భజన చేస్తామని హామీ ఇవ్వాలి. ఇక హక్కుల సంగతి దేవుడెరుగు. ఈ దోపిడీ నేపథ్యంలో 1921లో ఆంధ్రజన సంఘం ఏర్పడింది. 11మందితో ప్రారంభమైన సంఘం సంస్కృతి పరమైన హక్కుల సాధన కోసం కృషి చేసింది. కానీ అందులోనూ నిజాం భజనపరుల సంఖ్య పెరిగింది. కొందరు బయటికొచ్చి 1930లో ఆంధ్ర మహాసభ స్థాపించారు. ఇది కేవలం భాష,సాంస్కృతిక ఉద్యమాలకే పరిమితం కాలేదు.రైతులు,కూలీల సమస్యలపై పోరాడింది. వెట్టి చాకిరిని వ్యతిరేకించింది. రైతు సభలు పెట్టింది. ఆర్యసమాజం కూడా నిజాం రాజుకు వ్యతిరేకంగా పని చేయడం ప్రారంభించింది. ఇటు ఆంధ్రమహాసభ, అటు ఆర్యసమాజాలు హైదారాబాద్ సంస్థాన ప్రజల్లో కొత్త వెలుగు నింపే ప్రయత్నం చేశాయి.

కాలం గడిచేకొద్దీ ఆంధ్రమహా సభ విప్లవ సభగా మారిది. చురుకైన యువకులను సమీకరించి నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేసింది. గ్రామాల్లో జమీన్‌దార్,పటేల్,పట్వారీ దేశ్‌ముఖ్ లకు పక్కలో బల్లెంలా మారింది. దొరలను ప్రజలు ప్రశ్నించారు. వెట్టిచాకిరి, అక్రమ పన్ను వసూళ్లను అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో దొరలు, భూస్వాములు దాడికి దిగారు. ఆంధ్రమహాసభ కూడా ఆత్మరక్షణ దాడులను మొదలుపెట్టింది.

  • కడివెండి.. 

విసునూర్ గ్రామంలో రామచంద్రారెడ్డి అధీనంలో60 గ్రామాలు ఉండేవి. అతని అరాచకాలకు అంతుండేది కాదు. రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొయిహినుద్దిన్ లాంటి నాయకులు తరుచు గ్రామల్లోకి వెళ్లి మీటింగులు పెట్టి జనాలను సమీకరించేవారు. ఇది జీర్ణించుకోని విసునూరు దొర, సంఘం నాయకులపై కక్షకట్టి వారిని చంపాలని పథకం వేశాడు. అయితే ప్రజలు సంఘానికి అండగా ఉండడంతో అది విఫలమైంది. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ పొలాన్ని రాంచంద్రారెడ్డి గుంజుకోడానికి యత్నించాడు. సంఘం అడ్డుకుంది. ఈ విజయం తెలంగాణా ప్రజలను ఉత్తేజ పరిచింది. రామచంద్రారెడ్డి ఆగడాలు ఆగలేదు. పేద రైతయిన బందగీ పొలాన్ని కబ్జా చేశాడు. బందగీ కోర్టులో 14 ఏళ్ళు పోరాటం చేశాడు. అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. జీర్ణించుకోలేని రామచంద్రారెడ్డి గూండాలతో బందగీని చంపించాడు. 1940 జూలై 19న బందగీ అమరుడయ్యాడు. జనం గడిపై దాడి చేశారు. దొర గుండాలు కాల్పులు జరిపారు. కాల్పులలో దొడ్డి కొమరయ్య మరణించాడు. చాలా మంది గాయపడ్డారు. అగ్గి రాజుకుంది. ఆంధ్రమహా సభ కమ్యునిస్టు పార్టీగా మారింది. నిజాం ఉలిక్కిపడ్డాడు. ప్రైవేట్ సైన్యాన్ని రంగంలోకి దింపాడు. కాశీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు పల్లెల్లో నెత్తుటేర్లు పారించారు. ఆడబిడ్డలను చెరబట్టారు. తెలంగాణ రైతులు, బీదాబిక్కీ జనం తిరగబడ్డారు.నాటి పోరాటంలో తెలంగాణలోని ప్రతి పల్లె రక్తం చిందించినదే..!

కానీ నేడు రాజకీయ పార్టీలు తెలంగాణాలో సెప్టెంబర్ 17 నాడు చేస్తున్న పోలిటికల్ డ్రామాలు చూస్తుంటే.. చరిత్ర ఏంటో తెలిసీ… రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలే ముమ్మరం గా  జరుగుతున్నాయని ఇట్టే అవగతమవుతుంది.

సెప్టెంబర్ 17 అంటే ఒక ఉద్యమం, ఒక ఉద్వేగం. చరిత్రలో నిలిచిపోయిన సందర్భం. పాత తరాల పోరాటానికి, భావితరాలు స్ఫూర్తి పొందడానికి సూచిక. అప్పుడు జరిగింది.  

  • నిరంకుశ ప్రభువుకు ప్రజలకు మధ్య జరిగిన పోరు. కానీ దాని హిందూ ముస్లిం మతాల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం  హాస్యస్పదమే అవుతుంది.

రాచరికం హద్దు మీరినప్పుడు.. నిరంకుశత్వం పతాక సాయికి చేరినప్పుడు.. కచ్చితంగా విప్లవమే వస్తుంది. తెలంగాణలో కూడా అదే జరిగింది. ఏళ్ల తరబడి నిజాం నిరంకుశ పాలనలో విసిగిపోయిన ప్రజలు.. పోరాటాలకు సిద్ధమయ్యారు. ప్రతి గ్రామంలో కుల మతాలకు అతీతంగా జనం ఏకమై యుద్ధానికి నడుం బిగించారు. చావు రేవో తేల్చుకోవడానికి తెగించి రంగంలోకి దూకారు. నిజాం ముస్లిం. మెజార్టీ ప్రజలు హిందువులు. కానీ పోరాటం మతకోణంలో జరగలేదు. నిజాం నిరంకుశత్వమే కాదు.. నిజాంను అడ్డుపెట్టుకొని హిందూ దొరలు చేసిన అరాచకాలు కూడా తక్కువేం కాదు. ఈ మొత్తం అరాచకాలకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం జరిగింది.సెప్టెంబర్ 17.. తెలంగాణ చరిత్రలో మరిచిపోలేని రోజు.. రాజరికపాలనుంచి ప్రజాస్వామ్యానికి పరివర్తన చెందిన రోజు. ఆరోజు ఏం జరిగిందో చరిత్రలో నిక్షిప్తమై ఉంది.

[zombify_post]

Report

What do you think?

*సిఎం కేసిఆర్ ప్రత్యేక చొరవ వల్లే తెలంగాణ గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామా లాగా నిలుస్తున్నాయి*

న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది.. చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారు: బ్రాహ్మణి