భూమి కోసం, భుక్తి, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణలో గ్రామగ్రామాన సాగింది. రజాకార్ల అరాచకాలతో ఆగ్రహించిన ఎందరో త్యాగధనుల వీరోచిత పోరాటాలతో బానిస సంకెళ్లు తెంచుకున్నది. ఆంధ్రమహాసభ, గుతుపల సంఘం నడిపిన ఆ ఉద్యమంలో పోరాడిన వారిలో అగ్రగణ్య చాకలి ఐలమ్మ.
తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మహిళ ఆమె. భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై సమరశంఖం పూరించిన ధీర వనిత. కడవెండి, భైరాన్ పల్లి, కూటిగల్లు, ధర్మపురం, విసునూరు, మొండ్రాయి, గుండాల, దేవరుప్పుల, నర్మెట, గొలనుకొండ, కామారెడ్డి గూడెంలలో సాగిన రైతాంగ పోరాటానికి వెన్నుదన్నుగా ఆ వీరవనిత నిలిచారు. చాకలి ఐలమ్మ పేరు పలకకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర అసంపూర్తి. రజక కుటుంబంలో పుట్టి పెత్తందారుల గుండెల్లో తుపాకి గుండై పేలింది. రజాకార్లు, దేశ్ ముఖ్ ఆగడాలను చీల్చి చెండాడిన వీరనారి ఐలమ్మ. ఆమె ఇంటిపేరుతో కలిపి చిట్యాల ఐలమ్మ అయినా రజక అస్మిత కోసం కులం కలిపి ఆమెను చాకలి ఐలమ్మగా వ్యవహరిస్తున్నారు. చిట్యాల ఐలమ్మగా వ్యవహరిస్తే ఆమె ఖ్యాతి పాలకుర్తికే పరిమితం అయ్యేది. చాకలి ఐలమ్మగా వినుతికెక్కడం వల్లనే ఆమె విగ్రహాలు తెలుగు రాష్ట్రాల్లో ఉరూరా అసంఖ్యాకంగా దర్శనమిస్తున్నాయి.
వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా ఐలమ్మ జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. కులవృత్తే వారికి జీవనాధారం.
పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది. అదే విస్నూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపు అయింది. అప్పుడే వెట్టిగొట్టాలు చేయవద్దని పిలుపునిచ్చి 1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ ముఖ్ లు, రజాకర్ల అరాచకాలపై ఎదురుతిరిగి ఎర్రజెండా పట్టి, ఆంధ్రమహాసభ (సంఘం)లో చేరింది ఐలమ్మ. కష్టజీవులను చేరదీసి భూస్వాముల కట్టుబాట్లను సవాల్ చేసింది. ఆడది ముందుబడి తన ఆధిపత్యాన్ని వెనుకబడేసిందని రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. దీంతో ఐలమ్మపై దొర కక్ష పెంచుకున్నాడు. కౌలుకు తీసుకున్న భూమిలో కాపుకొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండాలను పురమాయించారు. తనకు వ్యవసాయమే ముఖ్యమని, దొర గడీలో వెట్టిచేయను పో అని గట్టిగా చెప్పింది. ఈ భూమినాది… పండించిన పంటనాది… తీసుకెళ్లడానికి దొరెవ్వడు… నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలింది. సంఘం కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోసారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్‌ముఖ్ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. ఐలమ్మ ఇంటిని తగులబెట్టి, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కుమారులు ముగ్గురు పాలకుర్తి పట్వారీ ఇంటిని కూల్చి అదే స్ధలంలో మొక్కజొన్న పంటను పండించారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడలేదు. ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకొన్నది.నీ దొరోడు ఏం చేస్తాడ్రా? అని మొక్కవోని ధెైర్యంతో రోకలిబండ చేతబూని గూండాలను తరమికొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. ఐలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. చాకలి ఐలమ్మ తెగువ.. సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తినిచ్చింది. పల్లెపల్లెన ఉద్యమం ఎగిసిపడి, దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. నైజాం వ్యతిరేక పోరాటానికి ఊపిరిలూదిన ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న ఊపిరి వదిలింది.
నేడు రాష్ట్రంలో దేశంలో ఎన్నో అకృత్యాలు, అసమానతలు ,అంతరాలు, వివక్షత కొనసాగుతున్నప్పటికీ ప్రజానీకం స్పందించకపోవడం, పట్టించుకోకపోవడం బాధాకరం. నాటి ఉద్యమంలో పాల్గొన్న వారిలో చాలా మంది నిరక్షరాస్యులే కేవలం 4 శాతంగా ఉన్నటువంటి అక్షరాస్యత ఆనాడు కొనసాగితే నేడు 75 శాతం అక్షరాస్యత ఉన్నప్పటికీ సమకాలీన పరిస్థితుల పట్ల స్పందించక పోవడం దురదృష్ణం. ఇకనైనా ప్రజానీకం ఉద్యమ శక్తులు, ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు కార్యాచరణ చేపట్టాలి. అదే చాకలి ఐలమ్మ అమరత్వానికి నిజమైన నివాళి. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బందగీ, నల్లా నర్సింహులు, ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డి వంటి మానవ శతఘ్నులు వారు ఈ గడ్డ మీద పుట్టడం మన అదృష్టం. వారిని మనం విస్మరించే కృతఘ్నులు నేల మీద పుట్టడం వారి దురదృష్టం.
దొడ్డి చంద్రం కురుమ, జర్నలిస్ట్ కడవెండి గ్రామం, జనగామ జిల్లా.