-
చాకలి అయిలవ్వ… తెలంగాణ తొలి విజయకేతనం.
-
చాకలైలవ్వ దొరలను చాకిరేవు నుతికి పారేసి 'సంఘాని' కూపునిచ్చె!
-
తెలంగాణ చాకలి అయిలవ్వ దొరలను చాకిరేవుకు ఉతికిన సమరక్షేత్రం
-
చాకలి (చిట్యాల) ఐలమ్మ(1895-1985) తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక.
-
ఆదివారం ఐలమ్మ 38 వర్ధంతి సందర్భంగా.. కామన్ మ్యాన్ న్యూస్ ప్రత్యేక కథనం.
సాయుధ తెలంగాణ పోరాటంలో ఐలమ్మ కనబరిచిన ధైర్య సాహసాలు.. సాయుధ తెలంగాణ పోరాటానికి స్ఫూర్తినిచ్చాయి.
ఉమ్మడి పాలనలో గుర్తింపునకు నోచుకోని పోరాట యోధులు, వీరయోధులను గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు.
కేసిఆర్ ప్రభుత్వం ఐలమ్మ వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడం హర్శించదగిన విషయం.
తెలంగాణ విముక్తి ఉద్యమంలో మెరిసిన అగ్ని కణమే వీరనారి చాకలి ఐలమ్మ. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేందుకు సాగుతున్న పోరు ఐలమ్మ రాకతో భూమి కోసం, భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదాల్చింది.
చిట్యాల ఐలమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పాలకుర్తి నియోజకవర్గంలోని కిష్టాపురం గ్రామంలో సాధారణ రజక కుంటుంబంలో జన్మించింది. అతిపిన్న వయస్సులోనే పాలకుర్తి గ్రామానికి చెందిన చిట్యాల నర్సింహతో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్న తరుణంలో పాలకుర్తిలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. నల్ల నరసింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి తదితర నాయకులు పాలకుర్తి కేంద్రంగా 1945లో ఆంధ్ర మహాసభను ఏర్పరిచారు. ఐలమ్మతోపాటు అనంతోజు బ్రహ్మయ్య , జీడి సోమనర్సయ్య , మామిండ్ల మల్లయ్య, మామిండ్ల కొమురయ్య , చుక్క సోమయ్య , మామిండ్ల ఐల్లయ్యలతోపాటు మరికొంత మంది యువకులు ఆంధ్ర మహాసభలో చేరారు. ఐలమ్మ ఇల్లే సంఘానికి కేంద్రంగా మారింది. సంఘ నాయకులకు రక్షణ కల్పించడం, భోజన వసతి కల్పించడం ఐలమ్మ పని.
రజాకార్ ఉపసేనాని విస్నూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి (బాబుదొర)లు 60 గ్రామాలలో ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రజలను హింసించడం, చంపటం, వెట్టిచాకిరీ చేయించుకోవడం వంటి ఎన్నో అకృత్యాలకు ఒడిగట్టారు. ఖాసీం రజ్వీ నాయకత్వాన ఉన్న రజాకార సేనలను పోషిస్తూ విస్నూరులో పోలీసు ఠాణాను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఆంధ్రమహాసభ ఎడారిలో ఒయాసిస్సూలా కన్పించింది. ఆంధ్ర మహాసభను ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. విస్నూరు దేశ్‌ముఖ్ ఆంధ్ర మహాసభను అంతం చేయాలని పంతం పట్టాడు.
ఈ క్రమంలో 1945 ఫిబ్రవరిలో పాలకుర్తి జాతర వచ్చింది. ఈ జాతర సందర్భంగా సంఘం ప్రచారం చేపట్టాలని ఆంధ్రమహాసభ పాలకుర్తి దళం ఆర్గనైజర్ చకిలం యాదగిరిరావు అనుకున్నారు. బహిరంగ సభ ఏర్పాటుకు సంఘం కార్యకర్తలతో చర్చించి కేంద్ర కమిటీకి తెలుపడంతో బహిరంగ సభకు ఆరుట్ల రామచంద్రారెడ్డి నిజాం ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. బహిరంగ సభను పాలకుర్తిలో ఏర్పాటు చేశారు. బహిరంగసభ జయప్రదమైతే తన పరువు పోతుందని భయపడిన దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి సభను భగ్నం చేసి ఆరుట్ల రామచంద్రారెడ్డిని చంపాలని 60 మంది గూండాలను పాలకుర్తికి పంపాడు. రామచంద్రారెడ్డిని చంపేందుకు ఆ గూండాలు విశ్వ ప్రయత్నం చేశారు. దీంతో బహిరంగ సభకు పోలీసు రక్షణ అడిగితే దేశ్‌ముఖ్‌తో కుమ్మక్కైన పోలీస్ అధికారి బందోబస్తుకు నిరాకరించారు. దీంతో ఆరుట్ల రామచంద్రారెడ్డి బహిరంగ సభ రద్దు చేసుకున్నారు.
సభ రద్దు విషయాన్ని సంఘం కార్యకర్తలకు తెలిపేందుకు ఆరుట్ల వాలంటీర్ల రక్షణలో ఓ ఇంటిలో ఉండగా రాత్రి 9 గంటల సమయంలో వనమా వెంకన్న నాయకత్వంలో గూండాలు ఆరుట్లపై దాడికి ప్రయత్నించారు. దీన్ని పసిగట్టిన సంఘం కార్యకర్తలు గూండాలపై ఎదురుదాడికి దిగగా వెంకన్న తలపగిలింది. దీంతో గుండాలు పారిపోయారు. ఈ దాడితో సంఘం కార్యకర్తలైన ఐలమ్మ కుటుంబంతో పాటు, నాయకులపై విస్నూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో 10 మందిని పోలీసులు అరెస్టు చేసి విస్నూరు పోలిసుస్టేషన్‌కు తరలించారు. సుబ్బారావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి పాలకుర్తి ప్రాంతంలోని కొండాపురంలో గల గిరిజన ఇండ్లల్లో తలదాచుకున్నారు.
సంఘానికి అండగా ఉన్న ఐలమ్మ కుటుంబాన్ని పాలకుర్తిలో లేకుండా చేసేందుకు దేశ్‌ముఖ్ వ్యూహం పన్నిండు. పాలకుర్తి పట్వారి శేషగిరిరావును దేశ్‌ముఖ్ ఏజెంటుగా ఏర్పాటు చేసుకొని ఐల్లమ్మ కుటుంబంపైకి ఉసి గొల్పిండు. దేశ్‌ముఖ్ అండతో విర్రవీగిన శేషగిరిరాపు ఐలమ్మ కుంటుంబాన్ని పొలం దున్నేందుకు నాగళ్లను పంపమనగా అందుకు ఆమె తిరస్కరించింది. దీంతో రెచ్చిపోయిన శేషగిరిరావు పాలకుర్తిలో సంఘం లేకుండా చేస్తానని, సంఘం కార్యకర్తల ఇండ్లు దున్ని విత్తనాలు వేస్తానని, గ్రామాన్ని తగులబెడ్తానని ప్రతిజ్ఞ చేసిండు. దీంతో ఆగ్రహంతో సంఘం కార్యకర్తలు శేషగిరిరావు ఇంటిని గునపాలతో తవ్వి నేల మట్టం చేశారు. నేలమట్టమైన ఇంటి స్థలాన్ని దున్ని మొక్కజొన్న విత్తనాలు వేశారు. నాలుగు నెలల తర్వాత మొక్కజొన్న కంకులను గ్రామస్తులందరూ మూకుమ్మడిగా మంటల్లో కాల్చుకు తిని దేశ్‌ముఖ్‌కు తగిన గుణపాఠం నేర్పారు. దీంతో ఐలమ్మ కుటుంబంపై మరింత పగ పెంచుకున్న దేశ్‌ముఖ్ అదను కోసం వేచి చూస్తున్నాడు.
దీంతో సంఘం నాయకులు భీమిరెడ్డి నరసింహారెడ్డి మరో 15 మందిని వెంటబెట్టుకుని వెళ్లి పొలం వద్ద మాటు వేశారు. ఇంతలో దేశ్‌ముఖ్ గూండాలు పంట కోసుకునేందుకు వచ్చారు. దీంతో సంఘం నాయకులు వారితో పోరాడుతూనే పంటను కోసి కట్టలు కట్టి ఐలమ్మ ఇంటికి చేర్చారు. దీంతో దేశ్‌ముఖ్ కోపంతో వారిపై కేసులు పెట్టాడు. పోలీసులు సంఘం నాయకులను, ఐలమ్మ కుటుంబీకులను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఆమె భర్తను, కొడుకులను దేశ్‌ముఖ్, రజాకార్లు హింసించి చంపినా ఐలమ్మ చలించకుండా మొక్కవోని ధైర్యంతో సంఘం వెంట నడిచింది. ఆ పోరాటయోధురాలు 1985 సెప్టెంబర్ 10న తుదిశ్వాస విడిచింది.ఆమెకు కామన్ మ్యాన్ వెబ్ న్యూస్ తరుపున ఘనమైన నివాళులు.
[zombify_post]