నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీలో మెయిన్ రోడ్డును 100 అడుగులకు విస్తరించడానికి, నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మునిసిపల్ కమిషనర్ కనకారావు పంపిన ప్రతిపాదనల మేరకు రోడ్డు విస్తరణ నిర్వాసితులకు రూ.27.7 కోట్లు, అబీద్ సెంటర్ నుంచి పెదబొడ్డేపల్లి మదుం వరకు ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫారాలు మార్చడానికి రూ.4.18 కోట్లు మొత్తం రూ.31.88 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. దీంతో భూసేకరణ అధికారిగా నర్సీపట్నం ఆర్డీవో జయరాంను నియమిస్తూ కలెక్టర్ రవిపట్టన్‌శెట్టి ఆదేశాలు జారీ చేశారు.
మెయిన్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అబీద్ సెంటర్ నుంచి పెదబొడ్డేపల్లి మదుం వరకు రహదారిని100 అడుగులకు విస్తరించడానికి మునిసిపల్ పాలకవర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రణాళికకు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆమోదం లభించింది. మెయిన్ రోడ్డుకి ఇరువైపులా 222 ప్రైవేటు ఆస్తులు, 12 ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. గత నెలలో ప్రభుత్వ భవనాలు కూల్చివేత పనులు పూర్తి చేశారు. ప్రైవేటు భవనాలకు చెందిన పలువురు యజమానులు నష్టపరిహారంగా టీడీఆర్ సర్టిఫికెట్లకు బదులు నగదు ఇవ్వాలని కోరారు. నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో భూసేకరణకు నష్టపరిహారంగా నగదు ఇవ్వడం లేదని, టీడీఆర్ సర్టిఫికెట్లు మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నదని అధికారులు చెప్పారు. దీంతో పలువురు యజమానులు ఎమ్మెల్యే గణేశ్‌ను కలిసి టీడీఆర్ సర్టిఫికెట్లు తమకు ఆమోదమేనని, అయితే రోడ్డు విస్తరణ 100 అడుగులు చేస్తే ఎక్కువ నష్టపోతామని, దీనిని 90 అడుగులకు తగ్గించాలని కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించడంతో 107 మంది భవన యజమానులు టీడీఆర్ సర్టిఫికెట్లు తీసుకోవడానికి అంగీకరించారు. మిగిలిన 92 మంది భవన యజమానులు నగదు రూపంలో నష్టపరిహారం కోరుతూ హై కోర్టును ఆశ్రయించారు. వీరికి భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టీడీఆర్ సర్టిఫికెట్లకు అంగీకరించిన ప్రదేశాల్లో 90 అడుగులకు, మిగిలిన చోట్ల 100 అడుగులకు రోడ్డు విస్తరణ పనులు చేపడతామని మునిసిపల్ అధికారులు వెల్లడించారు.
[zombify_post]