భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టెట్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు.ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న టెట్ పరీక్ష నిర్వహణపై శుక్రవారం విద్యా, వైద్య, పోలీస్,పంచాయతి, మున్సిపల్,మిషన్ భగీరథ, విద్యుత్,ట్రెజరి,ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్) నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 15న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం పరీక్ష నిర్వహణకు 37 కేంద్రాలు,సాయంత్రం పరీక్ష నిర్వాహణకు 29 కేంద్రాల్లో మొత్తం 8,717 అభ్యర్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. కొత్తగూడెంలో 16 కేంద్రాలు, పాల్వంచ మున్సిపాలిటీ లోని 6 కేంద్రాలు, మణుగూరు లో 8, భద్రాచాలంలో 7 కేంద్రాల్లో ఉదయం పరీక్ష జరుగుతుందని తెలిపారు. సాయంత్రం కొత్తగూడెం లో 16, పాల్వంచలో ఒకటి, మణుగూరులో 5, భద్రాచలంలో 7 కేంద్రాల్లో జరుగుతుందని చెప్పారు.ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా అదనపు బస్సుల ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. పరీక్ష నిర్వహణకు 380 మంది ఇన్విజిలేటర్లు,148 మంది హాల్ సూపరింటెండెంట్లు,37 మంది శాఖ పరమైన అధికారులు,37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 9 మార్గాలకు 9 మంది రూటు అధికారులను నియమించామని తెలిపారు. ప్రతి కేంద్రంలో సి సి టి వి లు ఉండాలని అన్నారు. మంచి నీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు.ప్రతి పరీక్ష కేంద్రంలో అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటుతో పాటు మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని చెప్పారు.సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబడవని తెలిపారు.ఈ సమావేశంలో డీఈఓ వెంకటేశ్వర చారి, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ స్వామి,ఆర్టీసీ డివిఎం భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]