అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని యు.చీడిపాలెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న కిల్లో వంశీకృష్ణ అనారోగ్యంతో ఈ నెల 14న మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి మృతుని బంధువులు, తోటి విద్యార్థుల తెలిపిన వివరాలు ప్రకారం… మండల కేంద్రానికి 30 కిలోమీటర్లు దూరంలో మూరుమూల ప్రాంతంలో యు.చీడిపాలెం గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు రెండు వారాల క్రితం ఆ గ్రామంలోని పిహెచ్సిలో వైద్య పరీక్షలు చేశారు. పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న వంశీకృష్ణకు అప్పటికే జ్వరంతో పాటు పచ్చకామెర్లు ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించి మెరుగైన వైద్యం నిమిత్తం మైదాన ప్రాంతానికి తీసుకెళ్లాలని సూచించారు. కాని పాఠశాల వార్డెన్ పట్టించుకోలేదు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ నెల 13న తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న వంశీకృష్ణను పాఠశాల ఉపాధ్యాయుడు పిహెచ్‌సికి తీసుకెళ్లగా, మైదాన ప్రాంతానికి తక్షణమే తరలించాలని మళ్లీ సూచించారు. అప్పుడు కూడా తీసుకెళ్లలేదు. వంశీకృష్ణ అనారోగ్యంతో ఉన్నాడని, వెంటనే వచ్చి తీసుకెళ్లాలని 14వ తేదీన ఉదయం సదరు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు బయలుదేరారు. ఇంతలోనే వంశీకృష్ణ స్ఫృహ తప్పి పడిపోయాడు. వెంటనే మైదాన ప్రాంతానికి తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయాడు. ఆ దారిలోనే తల్లిదండ్రులకు వంశీకృష్ణ మృతదేహాన్ని అప్పగించారు. పాఠశాల హెచ్ఎం కమ్ వార్డెన్‌గా ఉన్న మిరియాల రాజు పాఠశాలలో ఎప్పుడూ సరిగా అందుబాటులో ఉండటం లేదని, ఆయన నిర్లక్ష్యం కారణంగానే వంశీకృష్ణ మృతి చెందాడని బంధువులు, తోటి విద్యార్థులు ఆరోపించారు.
వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
హెచ్ఎం కమ్ వార్డెన్ మిరియాల రాజు పట్టించుకోకపోవడం వల్లే వంశీకృష్ణ మరణించాడని, వార్డెన్‌ను కఠినంగా శిక్షించాలని, మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఎస్.సూరిబాబు, జె.పెంటయ్య, పాంగి గంగరాజు, సిఐటియు నాయకులు వై.అప్పలనాయుడు డిమాండ్ చేశారు. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన వార్డెన్ల నిర్లక్ష్యం కారణంగా మన్యంలో తల్లిదండ్రులు తమ బిడ్డల శవాలను చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం, అధికారుల్లో చలనం ఉండటం లేదని ఆరోపించారు. దీనికి ప్రభుత్వం, అధికారులు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వర్కర్లను నియమించాలని అనేక సార్లు ప్రభుత్వానికి, ఐటిడిఎ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రజా సంఘాల నాయకులను హాస్టళ్ల లోపలకు అనుమతించకపోవడంతో, ఆశ్రమ పాఠశాలల హెచ్ఎం, వార్డెన్లు, సిబ్బందికి భయం లేకుండా పోయిందని, వారేమి చేసినా బయటకు తెలియడం లేదని పేర్కొన్నారు. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే పిల్లలు, వారి తల్లిదండ్రులు, ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
[zombify_post]