– సీఎం జగనన్న లక్ష్యం అదే
– నల్లజర్లలో ‘వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్’ ను ప్రారంభించిన ఎంపీ భరత్
నల్లజర్ల, సెప్టెంబరు 23: మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, తద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి ఉద్భవించినదే ‘వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్’లని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శనివారం రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గల గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం నల్లజర్లలో స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జీ.) సభ్యులతో ఏర్పాటు చేసిన మార్ట్ ను ఎంపీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మహిళా మార్ట్ లను ఎస్.హెచ్.జీ. సభ్యులచే ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఇటువంటి మార్ట్ లు నిర్వహిస్తున్నారని, నిడదవోలులో ఈ మార్ట్ రాష్ట్రంలో నలభైవదని ఎంపీ తెలిపారు. ఒక్కో మండలంలో దాదాపు 20 వేల మంది వరకూ స్వయం సహాయక గ్రూప్ సభ్యులు ఉన్నారని, వీరంతా కలిసి ఈ మార్ట్ ఏర్పాటు చేసుకునేలా ఒక మంచి ఆలోచన ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. పెద్దపెద్ద మార్ట్ ల స్థాయికి తప్పక ఈ మహిళా మార్ట్ లు అభివృద్ధి చెందుతాయని ఎంపీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమూల్, ఐటీసీ తదితర ఉత్పత్తిదారులతో టైఅప్ చేసుకుని హోల్ సేల్ గా వారి నుంచి ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి, ఇతర చోట్ల కన్నా సరసమైన ధరలకు ఇక్కడ విక్రయించడం వల్ల తప్పనిసరిగా కొనుగోలుదారులను ఈ మార్ట్ లు ఆకర్షిస్తాయన్నారు. చాలా అతి తక్కువ సమయంలోనే కోట్ల టర్నోవర్ కు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్నారు. కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా.. మహిళా రైతులను కూడా భవిష్యత్తులో మనం చూడబోతున్నామన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మహిళా మార్ట్స్ మార్కెట్‌లో రాణిస్తున్నాయో..ఆ మార్ట్ లో విక్రయించే బియ్యం, గోధుమ తదితర అతి ప్రధానమైన పంటలను స్వయంగా మహిళలే పండించి, వారే మార్ట్ ల ద్వారా విక్రయించే అవకాశం కూడా ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా కూడా మహిళలను ప్రోత్సహిస్తారన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళలను లక్షాధికార్లను చేయడానికి నడుంబిగిస్తే..వైఎస్సార్ తనయుడిగా మరో రెండు అడుగులు ముందుకు వేసి సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలను వ్యాపార సామ్రాజ్యంలో కీలక భూమి పోషించే దిశగా ఆచరణలో చూపిస్తున్నారని అన్నారు. మహిళా మార్ట్ లలో ప్రతీ వస్తువు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా మార్ట్ లనేవి సీఎం జగన్ గొప్ప ఆలోచన అన్నారు. నాలుగు రోజుల కిందటే లోక్‌సభ, రాజ్యసభలలో ‘మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లు’ ఆమోదం పొందడం శుభపరిణామమని అన్నారు. మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలలో మహిళలకు సగ భాగం ప్రాధాన్యతను సీఎం జగన్ ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ భరత్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!