రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచింది. ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, స్లాబుల మార్చటం పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపింది. విద్యుత్ బిల్లులు చెల్లించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని పరిశ్రమలు మూతపడుతున్నాయి. వ్యాపారాలు దెబ్బతిని, ఉపాధి తగ్గుతున్నది. డిస్కమ్స్‌కు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిపై వడ్డీ కూడా ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. ఇళ్లకు, షాపులకు స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారు. ప్రతి కనెక్షన్‌కు రూ. 13000 లు భారం పడనుంది. స్మార్ట్ మీటర్ల వలన డిమాండ్‌ను బట్టి గంటకు ఒక్కోరేటు పెట్టి వసూలు చేయబోతున్నది. ప్రజలపై వేసిన విపరీత భారాలను తక్షణమే రద్దుచేయాలని వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ మేరకు మద్దిలపాలెం పిఠాపురంకాలనీలో ఉన్న సిపిఐ(ఎం) విశాఖ జిల్లా కార్యాలయంలో వామపక్షపార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఐ(యం) జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలపై గత మూడేళ్ళ నుండి వైసిపి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు ప్రజలకు తెలియకుండానే ఎడాపెడా భారాలు వేస్తోంది. ఎపిఇఆర్‌సి ప్రజాభిప్రాయసేకరణలో ప్రజలు వ్యతిరేకిస్తున్నా వాటిని లెక్కచేయకుండా భారాలు వేయడం సరైందికాదు. మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తెస్తే ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయకపోయినా మన రాష్ట్రంలో వైసిపి అమలు చేయడం సిగ్గుచేటన్నారు. విద్యుత్ చార్జీల పెంపుకు, స్మార్ట్‌మీటర్లుకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్భంధంపై సెప్టెంబరు 27న గురుద్వార్ వద్ద ఉన్న సిఎండి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, మేధావులు పాల్గొని కరెంటు ఛార్జీలపై ప్రతిఘటనోద్యమాన్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రజానీకానికి వామపక్షపార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.ఎన్.క్షేత్రపాల్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ వై.కొండయ్య, ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి కె.శంకరరావు, సిపిఐ(ఎం)నాయకులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, వి.కృష్ణారావు, జి.వి.ఎన్.చలపతి, ఎం.వి.త్రినాధరావు, పి.వెంకటరావు, పీతలఅప్పారావు, అనపర్తి అప్పారావు, ఎస్.జ్యోతీశ్వరరావులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!
