-
పాలమూరు ప్రజల దశాబ్ధాల కల సాకారం..పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నేడు ప్రారంభం
-
పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్టం తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చుతామని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు తగినట్లుగానే రాష్ట్రంలోని సాగు, తాగునీటికి లోటు లేకుండా భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు ఎత్తిపోతల పథకం పూర్తి చేసి అందుబాటులో తెస్తోంది. ఇందులో భాగంగానే శనివారం రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు. ఫలితంగా పాలమూరు కరువు ప్రాంతంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. పాలమూరు గడ్డపై ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, జిల్లాల సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది ప్రభుత్వం.
ఎంతో కాలంగా నాగర్ తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న జలదృశ్యాన్ని నేడు కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అటుపై కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖాధికారులు పోలీసు, రెవెన్యూ అధికారులు సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు. దశాబ్ధాల కల ఇప్పటికి సాకారం అవడంతో పాలమూరు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత పథకం ప్రారంభోత్సవానికి వస్తుండటంతో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంతోపాటు మహబూబ్‌నగర్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు ప్రజలు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని (పీఆర్‌ఎల్‌ఐఎస్)కి రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది.
మొదటి దశలో తాగునీరు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. అందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా.. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది.
ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకొన్నాయి. ఇక ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగు, సాగునీరు అందనున్నది.
ప్రాజెక్టు నీళ్లతో 1,546 నీటికుంటలు, చెరువులను నింపనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్‌ఎస్ నేతలు ‘పాలమూరు పండుగ’ పేరుతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పంపింగ్ మోటర్లను సీఎం కేసీఆర్ ఆన్‌చేసి, కృష్ణా జలాలను దుంకించిన మరుక్షణం.. ఆ జలాలను కలశాలలో నింపుకొని ప్రతి ఊరిలోని ఆలయాల్లో ఉన్న దేవుళ్లకు జలాభిషేకం చేయనున్నారు.
భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేశారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజ్, మర్రి జనార్దన్‌రెడ్డితోపాటు కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు మూడ్రోజుల నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, నార్లాపూర్ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
పాలమూరు మహోజ్వల ఘట్టానికి నార్లాపూర్ వేదిక కానున్నది. ప్రాజెక్టులో కీలకమైన మొదటి పంప్‌హౌస్, అంజనగిరి రిజర్వాయర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మోటర్ల బిగింపు కొనసాగుతుండగా.. ఇప్పటికే రెండు మోటర్లు నీటి ఎత్తిపోతలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇటీవలే మొదటి పంపు డ్రైరన్‌ను నిర్వహించగా విజయవంతమైంది. అందులో భాగంగా నేడు జలాల ఎత్తిపోతలు చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్ నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు.
అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జలహారతి పట్టనున్నారు. అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు.
భారీ నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం పూర్తి చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఇంజినీర్‌లు చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం అంతే అత్యాధునిక, భారీ మోటర్ల ద్వారా నీటిని అందించేలా నిర్మాణాలు పూర్తి చేశారు.
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ ..పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాలనురగల జలహేల పారనుంది అంటూ ట్వీట్ చేశారు.
వలసల వలపోతల గడ్డపైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం కానుందని కవిత రూపంలో తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఇప్పటి వరకు కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో .. ఇకపై కృష్ణమ్మ జల తాండవం చేస్తుందని కవిత రూపంలో వెల్లడించారు.
రాష్ట్రానికి నీటి వాటా తేల్చకుండా కేంద్రం నిర్లక్ష్యం చేసిందని..అనుమతుల్లో అంతులేని జాప్యం చేసినప్పటికి కేంద్ర సర్కారు కక్షను వివక్షను తెలంగాణ సర్కారు దీక్షతో దృఢ సంకల్పంతో జయించి జలదృశ్యానికి శ్రీకారం చుడుతోందని తెలిపారు.
కరువు, వలస ప్రాంతానికి పుట్టినిల్లుగా ఉన్న పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పుడు కృష్ణమ్మ పరవళ్లతో పైరులు పచ్చగా పంచి ప్రజల జీవితాల్లో సంతోషం కనపడనుంది.
ఇదంతా 9ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధ్యపడటం నిజంగా గర్వకారణమని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లెలు, గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు.
[zombify_post]