డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా : మండపేట
2019 ఎన్నికల్లో చంద్రబాబు మోచేతి నీళ్ళు ఇంకెంత కాలం తాగుతావ్ తోట త్రిమూర్తులూ, చంద్రబాబు పల్లకీ మోయడానికేనా నువ్వున్నది అంటూ తనపై విమర్శలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరి పల్లకీ మోయడానికి సిద్ధ పడ్డావో నీ అంతరాత్మను అడిగి తెలుసుకుంటే బాగుంటుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనెవరి మోచేతి నీళ్ళూ తాగి బ్రతికేవాణ్ణి కాను.. కోనసీమ నీళ్ళు తాగి పైకెదిగిన అసలు సిసలైన కోనసీమ కాపు ముద్దు బిడ్డనంటూ తనదైన శైలిలో పవన్ పై బాణాలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు అనే వ్యక్తి పెద్ద అనకొండ.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అమాంతం మింగేసి జనసేన పార్టీనే నామ రూపాల్లేకుండా చేసేస్తది జాగ్రత్తగా చూసుకో పవన్ కళ్యాణ్ అంటూ ఇది నా సూచన మాత్రమేనన్నారు.
నేనింత వరకూ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు యొక్క వ్యక్తిగత విషయాల్లో తల దూర్చలేదు. కానీ, నా మీద ఆయన ఎన్నో వ్యక్తిగత విమర్శలు చేశారు. అడిగిన ప్రతీ దానికీ సమాధానం చెప్పడం లేదన్నావు కదా.. ఇక నుంచి చెబుతా. నీ వ్యక్తిగత విషయాల్లోకీ వస్తా కాసుకో వేగుళ్ళా ఖబడ్దార్ అంటూ సవాల్ విసిరారు. మండలంలోని తాపేశ్వరం అతిథి పంక్షన్ హాలులో గురువారం వైఎస్సార్ పింఛన్ కానుక కార్యక్రమం జరిగింది. ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల ప్రత్యేక అధికారి ఓ రామకృష్ణ, ఎంపీడీవో ఐదం రాజులు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 728 మందికి కొత్తగా మంజూరైన పింఛన్ సొమ్ములను ఆయన ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీ, ఎంపీటీసీలతో కలిసి లబ్ధిదారులకు అందించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్సీ తోట ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట వేసి ప్రజల బాగోగులు చూసుకుంటున్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు సీఎం జగన్ అయితే ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి మాత్రమే హామీలిచ్చే బూటకపు నాయకుడు నారా చంద్రబాబు అంటూ ద్వజమెత్తారు. మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాదిరిగా డబ్బు సంచులను నమ్ముకున్న వ్యక్తిని కాదన్నారు. ప్రజల విశ్వాసాన్ని, ప్రజల అభిమానాన్ని మాత్రమే నమ్ముకున్న నాయకుణ్ణనని వేగుళ్లకు చురకలు అంటించారు. మండపేట నియోజక వర్గంలో అసలు ఎమ్మెల్యే ఉన్నారన్న విషయాన్ని నియోజక వర్గ ప్రజలంతా ఏనాడో మరిచి పోయారంటూ ఆయనపై విమర్శలు సంధించారు. నేనొచ్చాక ప్రజలు గతంలో మాదిరి ఎమ్మెల్యే ఇంటి గేట్లు ముందు వేలాడే రోజులు పోయాయన్నారు. ఎనీ టైం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న నేపథ్యంలో గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రించే రోజులు వచ్చాయని తెలియజేశారు. మాట్లాడితే వ్యక్తి గత విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే వేగుళ్లకు నేను సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈ వేదిక ద్వారా పూర్తిగా మాట్లాడే అవకాశం లేదని రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే అడిగిన ప్రతీ దానికీ సమాధానం ఇస్తానని పేర్కొన్నారు.
పల్లిపాలెం భూముల కోసం మాట్లాడతావా వేగుళ్ళా .. సమాధానమిస్తా కంగారు పడకన్నారు. పాతికేళ్ల నుంచి మిమ్మల్ని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు న్యాయం చేయలేని మీరు నా కోసం మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉన్నందుకు మీరు న్యాయం చేయక పోగా, మా కష్టాలు తీర్చిన తోట త్రిమూర్తులును ఆడి పోసుకుంటున్న మీరూ నాయకుడేనా అని స్వయంగా వేగుళ్ల పూర్వాశ్రమంలో పని చేసిన కార్యకర్తలే చీదరించుకున్నా మీకు సిగ్గేయడం లేదా అంటూ ఎమ్మెల్యేను తూర్పార పట్టారు.
నేనే పార్టీలో ఉంటానో నాకే తెలియదని రాజకీయ లబ్ది కోసం నియోజక వర్గంలో ఎమ్మెల్యే వేగుళ్ల ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పుడు చెబుతున్నా ప్రజలు ఏ పార్టీని నమ్మితే ఆ పార్టీలో ఉంటానని వేగుళ్లకు వివరించారు. ప్రజలకు ఏ ప్రభుత్వమయితే మేలు చేస్తుందో, ప్రజల కోసం ఏ ముఖ్యమంత్రి పని చేస్తారో, ప్రజా సంక్షేమాన్ని ఎవరు కాంక్షిస్తారో ఆ పార్టీలో ఉంటానని స్పష్టం చేశారు. మీలాగా ఓట్ల కోసం డబ్బు సంచులను నమ్ముకున్న నాయకుణ్ణి కాదన్నారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటూ వారికి న్యాయం చేకూర్చి తద్వారా వారి విశ్వాసంతో ఓట్లు కోరుకునే నాయకుణ్ణి అని స్పష్ట పరిచారు. మండలంలోని రైతులకు మేలు జరిగితే చూడలేక పోయిన మీరు నా మీద తప్పుడు విమర్శలు చేసినంత మాత్రాన ఎవరూ నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. ఆ రోజున ఆ మూడు గ్రామాల్లోని రైతులు, మీ పార్టీ లోని నాయకులు కూడా నేను చేసిన కృషికి అభినందిస్తూ మీ వ్యాఖ్యలు సరైనవి కాదని చెప్పినప్పుడు కూడా మీరు తెలుసుకోలేక పోయారన్నారు. మీకే కనక చిత్తశుద్ది ఉండి వుంటే కేశవరం రండి మాట్లాడుకుందామని రైతులు సవాల్ చేస్తే ఎందుకు వెళ్ళలేక పోయారని నిలదీశారు. భవిష్యత్తులో టీడీపీ కనుమరుగై పోతుందన్న ఆందోళనలో ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని దుయ్యబట్టారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారు..ఏమైపోతుందో రాష్ట్రం .. రావణకాష్టం చేసేస్తున్నారని అంటున్న పవన్ కళ్యాణ్ 2014లో ఏమై పోయారని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల కోసం గళమెత్తిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను బూటు కాళ్ళతో తొక్కించి చంద్రబాబు ఉక్కుపాదం మోపినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా మీకని పవన్ కళ్యాణ్ ను అడిగారు. రాజకీయాల్లో ఏ నాయకుడైనా తన కోసం తన పార్టీ విధివిధానాలతోనూ ప్రజల్లోకి వెళ్తారే గానీ ఆ పార్టీని ఓడించండి ఈ పార్టీని ఓడించండని పక్కోడికి పడి ఏడవరని హితవు పలికారు. మీకు, మీ కుటుంబానికి ఏ అన్యాయం చేశానని అమలాపురం మీటింగ్ లో నన్ను ఓడించండని పిలుపు నిచ్చారో చెప్పాలన్నారు. అప్పట్లో మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మా మాటలు మీరేమైనా విన్నారా అని ప్రశ్నించారు. 2014 లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా గెలుపొందిన నేను 2019 లో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే మీకు తప్పొచిందా పవన్ కళ్యాణ్ అని తనదైన రీతిలో ప్రశ్నలు సంధించారు. కాపులై పుట్టి బాబు మోచేతి నీళ్ళు త్రాగుతారా అని పవన్ కళ్యాణ్ ఆ రోజు అన్న మాటలను తోట గుర్తు చేశారు. తోట త్రిమూర్తులు ఎవరి మోచేతి నీళ్ళూ తాగే రకం కాదన్నారు. కోనసీమ నీళ్ళు తాగి బ్రతికిన కాపోడు తోట త్రిమూర్తులని మరోసారి పవన్ కళ్యాణ్ కు తెలియ జెప్పారు. ఇవన్నీ నా వ్యక్తి గతంగా అంటున్న మాటలు మాత్రమేనని ప్రజలకు వివరించారు.
రాష్ట్రంలో కాపులంతా అందరి లాగా కాపోడు సీఎం అయితే చూద్దాం అని ఆశ పడ్డారన్నారు. నా వ్యక్తిగతం వరకూ అందులో నేను కూడా ఉన్నానని చెప్పారు. కానీ పవన్ రాష్ట్రంలోని కాపుల ఆశలు అడియాశలు చేశారని వివరించారు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ పై నమ్మకం పెట్టుకుని రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఓట్లు వేసినా గెలవరని తెలిసి కూడా లక్షలాది మంది ఓట్లు వేశారన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చారు. రామచంద్రపురం నుంచి తాను 2019 లో పోటీ చేస్తే కేవలం 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయానన్నారు. 18 వేల ఓట్లు జనసేనకు పడితే అందులో 15 వేల ఓట్లు కాపులు వేసినవేనన్నారు. ఆ ఓట్లన్నీ 1994 నుంచి నన్ను నమ్ముకుని నాతో పాటు ప్రయాణం చేసిన నా కాపు సోదరుల ఓట్లన్నారు. ఏదో పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా ఈసారైనా నిన్ను సీఎం చేద్దామని ఆ రోజున నాకు చెప్పి వేసిన ఓట్లని తెలియజేశారు. అంత నమ్మకం మీపై కాపులు పెట్టుకుంటే ఇప్పుడు ఎవరితోనో అంటకాగి ఎవరినో అందలం ఎక్కిస్తాను అంటే కాపులెవరూ మీ మాటను స్వీకరించే స్థితిలో లేరన్నారు. కాపు ఉద్యమ సమయంలో ముద్రగడ అవమానానికి గురైతే పరామర్శించడానికి దాసరి నారాయణరావుతో సహా మీ అన్నయ్య చిరంజీవి మధురపూడి విమానాశ్రయానికి వస్తే కిందికి దిగనివ్వకుండా చంద్రబాబు పోలీసులను ప్రయోగించారన్నారు. ఆ విషయం మీరు మరిచి పోతే ఎలా పవన్ కళ్యాణ్ గారని అన్నారు. బాబును పరామర్శించడానికి రాజమండ్రి సెంట్రల్ కు వచ్చి మీ పక్కన కూర్చున్న బాలకృష్ణ మిమ్మల్నీ మీ కుటుంబాన్ని అన్న మాటలు కూడా మీకు గుర్తుకు రావడం లేదా పవన్ కళ్యాణ్ గారూ అన్నారు. అవినీతి పైనే నా పోరాటం అవినీతి సీఎం ను గద్దె దింపడమే నా ధ్యేయం అంటున్న మీరు అదే అవినీతి కేసులో జైలుకు వెళ్లిన బాబుతో మిలాఖత్ అవడం ఎంత వరకూ సమంజసమో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఇవన్నీ మీపై చేస్తున్న విమర్శలు మాత్రం కాదన్నారు. ఆ రోజున మీరన్న మాటలనే మీకు గుర్తు చేస్తున్నానని విన్నవించారు. ఏ పార్టీకైనా ఉన్న ఫలంగా అధికార పీఠం దక్కదన్నారు. దాని వెనక ఎన్నో ఏళ్ళ కష్టం ఉంటుందన్నారు. ఒకప్పుడు బీజేపీ కూడా దేశంలో రెండే స్థానాలు గెలుచుకుందన్నారు. ఇప్పుడు దాని పరిస్థితి మీకు చెప్పనవసరం లేదన్నారు. అలాగే పార్టీ పెట్టామంటే కొంత కాలం ఓర్పు ఉండాలంటూనే
ఇవన్నీ మీ సొంత అజెండాలని నాకు అవసరం లేదన్నారు. కానీ బాబు అనే వ్యక్తి పెద్ద అనకొండ అనే విషయాన్ని మీరు గుర్తెరగాలన్నారు. గతంలో సీపీఐ, సీపీఎం పార్టీలు అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్ళేవన్నారు. రాష్ట్రంలో ఏదో చోట నుంచి పోటీ 4లేక 5 సీట్లు తెచ్చుకుని ఏదో మూల ఉద్యమాలతో వందలాది మంది కార్యకర్తలతో కనిపిస్తూ ఉండే వారన్నారు.1994 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక ఆ రెండు పార్టీలు ఏమై పోయాయో కూడా కనిపించడం లేదన్నారు. అలా బాబుతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీలను బాబు అనకొండ మాదిరి మింగేయడం ఖాయమన్నారు. అలా మీ పార్టీ అవుతుందేమో చూసుకో పవన్ కళ్యాణ్ గారంటూ సూచన చేశారు. నేను కూడా కాపునే కాబట్టి మీ పార్టీ అంతరించి పోతుందేమోనన్న బాధతో మీకు చెబుతున్నానని పేర్కొన్నారు. ఏది ఏమైనా ప్రజలంతా వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తి కరంగా ఉన్నారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను మళ్లీ అఖండ మెజారిటీతో ప్రజలంతా గెలిపించు కోవడం ఖాయమన్నారు.
[zombify_post]