డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం టౌన్ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన 144 సెక్షన్‌ను జిల్లాలోని 22 మండలాల్లో కూడా అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుసరాపు శ్రీధర్ తెలిపారు. ఎస్పీ శ్రీధర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రిమాండ్ అనంతరం చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన దృష్ట్యా జిల్లా పోలీసు శాఖ తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తోందన్నారు. 144 సెక్షన్ అమలులో ఉండడంతో జిల్లాలో ఎవరూ రోడ్లపైకి వచ్చి గుమిగూడడం, ఆందోళనలు చేపట్టడం నిషిద్ధమని ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలిస్తున్న క్రమంలో బందోబస్తుపరంగా అదనపు బలగాలను రంగంలోకి దింపినట్లు వివరించారు. జిల్లాలోని అమలాపురం, రావులపాలెం, కొత్తపేట, రాజోలు, ముమ్మిడిరం, రామచంద్రపురం, మండపేట తదితర ముఖ్య ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఆందోళనకు దిగే పరిస్థితులు ఉన్న టీడీపీ ముఖ్య నాయకుల ఇళ్ల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ ప్రత్యేక వైర్‌లెస్ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా శాంతి భద్రతలపై ఆయన చర్చించారు.
[zombify_post]
