చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు నిరసన దీక్షలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిసైతం నిరవధిక దీక్షలో కూర్చున్నారు.
శనివారం తెల్లవారు జామున నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దీక్షాశిబిరం వద్దకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అఖిలప్రియ మద్దతుదారులు పోలీసులను ప్రతిఘటించే ప్రయత్నం చేయగా.. పోలీసులు బలవంతంగా అఖిల ప్రియ, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డినిసైతం అదుపులోకి తీసుకున్నారు.