రైతన్నకు పంటతో పాటు పాడి కూడా అత్యంత ముఖ్యమైనది. అటువంటి పాడి పశువులకు వ్యాధులు సోకితే చికిత్స అందించాల్సిన పశు చికిత్సాలయాలు పరిస్థితి మందస మండలంలో అత్యంత ధీనావస్థలో ఉంది. సేవలందించేందుకు కనీస సౌకర్యాలు లేక సిబ్బంది కొన్నిచోట్ల అష్ట కష్టాలు పడుతున్నారు. కొన్నిచోట్ల భవనాలు ఉన్న సిబ్బంది లేక, మరికొన్నిచోట్ల అరకొరా సిబ్బంది ఉన్న భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పశు వైద్యశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రమైన మందస పశు చికిత్సలయ పరిస్థితి కడుదైన్యంగా ఉంది. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. 14 సచివాలయాల పరిధిలోని పాడి రైతులకు చెందిన పశువులకు సేవలు అందించాల్సిన ఈ పశువైద్యశాలలో కాంపౌండర్, విఏ , జేవివో,అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశు వైద్యాధికారిగా దువ్వాడ శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఆయనకు బేతాళపురం, పిడిమందస పశు చికిత్సలయాలకు కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో పాడి రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. హరిపురం పశువైద్యశాలలో వైద్యాధికారిగా కిల్లి. ఉమాభారతి విధులు నిర్వహిస్తున్నారు. ఈ పశువైద్యశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మరోవైపు అటెండర్ పోస్టు ఖాళీగా ఉంది. బేతాళపురం పశు వైద్యశాలకు రెగ్యులర్ వైద్యులు లేకపోగా, కాంపౌండర్ కూడా లేని పరిస్థితి నెలకొంది. అటెండర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు పిడిమందస పశు వైద్యశాల పరిస్థితి చూస్తే కాంపౌండర్ మాత్రమే విధులు నిర్వహిస్తుండగా, రెగ్యులర్ వైద్యులు అటెండర్ లేని పరిస్థితి ఉంది. ఇక కిల్లోయి సబ్ సెంటర్ లో ఎవరూ లేక పశువైద్యశాల మూతపడిన పరిస్థితి నెలకొంది. ఇలా పలు ఇబ్బందుల నడుమ పశువైద్యశాలలు కొట్టుమిట్టాడుతున్నాయి. పనిచేసే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు అవస్థలు పడుతున్నారు. పశువులకు వ్యాధులు సోకి సేవలు కోసం పశు చికిత్స లయాలకు తరలివచ్చి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో నిరాశగా వెను తిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.ఇప్పటికే పలుమార్లు రైతు సంఘాల ఆధ్వర్యంలో మండల అధికారులకు రెగ్యులర్ పశువైద్యాధికారులును నియమించాల్సిందిగా వినతులు అందజేసినప్పటికీ చర్యలు శూన్యమని పలువురు రైతులు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. ఇకనైనా పశు చికిత్సలయాలకు రెగ్యులర్ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలని, నూతన భవనాలు మంజూరు చేయాలని పలువురు పాడి రైతులు కోరుతున్నారు.
[zombify_post]