పల్లీలు అమ్మినంత ఈజీగా ఫేక్ సర్టిఫికెట్ల దందా.. కేజీ నుంచి పీజీ దాకా ఏదైనా చిటికెలో రెడీ
ఏలూరు :- మంచి అవకాశం మించిన దొరకదు త్వరపడండి.. అంటూ వ్యాపార సముదాయాలు పండుగలకు తెగ ఆఫర్లు ప్రకటించేస్తుంటారు. అయితే ఇక్కడ పబ్లిక్ గా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ మాత్రం లేదు కానీ.. మీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఆక్కడ దొరుకుతుంది. మార్కెట్లో పల్లీలు అమ్మినంత ఈజీగా ఫేక్ సర్టిఫికెట్లు అమ్మేస్తున్నారు ఓ ముఠా. ఏదో సినిమాలో అన్నట్టుగా జీఎం కావాలా.. ఏజీఎం కావాలా.. టోపీ పెట్టుకునే ఉద్యోగం కావాలా.. అంటూ నిరుద్యోగులను బురిడీ కొట్టించిన సన్నివేశం మీకు గుర్తు ఉండే ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలానే పరిస్థితి ఉంది. కేజీ నుంచి పీజీ వరకు మీకు నచ్చిన కాలేజీలో మీరు చదివినట్లుగా మీకు సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరు ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్లు చలామణిలో ఉన్నాయి. అయితే అలాంటి ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా ఆట కట్టించారు ఏలూరు పోలీసులు.. చింతలపూడి కేంద్రంగా జరుగుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఏలూరు కు చెందిన దినేష్ కంప్యూటర్ పరిజ్ఞానంలో ఎంతో అనుభవం ఉంది. చింతలపూడి కి చెందిన సోంబాబు తన పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులను ఏలూరులోనీ కొన్ని కాలేజీలకు క్యాంపెయిన్లో బాగంగా కొత్తగా కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులను జాయిన్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే దినేష్ కు సోంబాబుకు పరిచయం ఏర్పడింది. అయితే ఈ విద్యార్హత లేకుండా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందాలనే వారి వీక్నెస్ను వీరు క్యాష్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే చెన్నైలో ప్రింటర్లు, లాప్టాప్, సర్టిఫికెట్ల తయారీకి కావలసిన పేపర్లు, హోలోగ్రామ్స్, రబ్బర్ స్టాంపులు సమకూర్చుకున్నారు. ఎవరికి ఏ కాలేజీలో చదివినట్లుగా కావాలో ఆ కాలేజీ పేరుతో లోగోలను సిద్ధం చేసి ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేయడం ప్రారంభించారు. ఒక్కొక్క సర్టిఫికెట్ కు ఒక్కో రేటు ఫిక్స్ ఫిక్స్ చేసి అమ్మకాలు ప్రారంభించారు. విద్యార్హతను బట్టి రూ. 10 వేల నుండి రూ.1.50 లక్షల వరకు సర్టిఫికెట్‌లను అమ్ముతున్నారు. టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా వారి దగ్గర లభిస్తుంది.
ఆర్థిక లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారా తయారు చేస్తూ.. పోస్టు ద్వారా సర్టిఫికెట్లు కావాలనుకున్న వారికి పంపిస్తున్నారు. ఇటీవల ఏలూరుకు చెందిన ఓ కళాశాల పేరుతో వారు విక్రయించిన ఫేక్ సర్టిఫికెట్ వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ కాలేజీ యాజమాన్యం నిందితులను పట్టుకునేందుకు తమకు సర్టిఫికెట్ కావాలంటూ చింతలపూడికి చెందిన సోంబాబును సంప్రదించారు. అయితే వారికి కావలసిన సర్టిఫికెట్ కోసం వారిని చింతలపూడికి రమ్మని సోంబాబు తెలిపాడు. చింతలపూడి వెళ్లిన కాలేజీ యాజమాన్యం సభ్యులు సోంబాబుతో ఫోన్లో మాట్లాడి అతడు ఎక్కడున్నాడనే వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని మొత్తం చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సోంబాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులకు విచారించారు. విచారణలో సోంబాబు దినేష్ పేరు బయట పెట్టడంతో పోలీసులు ఏలూరులో దినేష్ ఇంటిపై తనిఖీలు నిర్వహించి లాప్టాప్, ప్రింటర్, వివిధ కాలేజీల లోగోలుతో ఉన్న నకిలీ సర్టిఫికెట్లు, హోలోగ్రామ్స్ రబ్బర్ స్టాంపులు, రెండు పెన్ డ్రైవ్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి సెల్ఫోన్లో డేటా ఆధారంగా నకిలీ సర్టిఫికెట్లు ఎవరెవరికి అమ్మారో వారి వివరాలు తీసుకుని వాటిని స్వాధీనం చేసుకుంటామని, అలాగే నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 50కి పైగా నకిలీ సర్టిఫికెట్ అమ్మినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.
This post was created with our nice and easy submission form. Create your post!