హైదరాబాద్/అమరావతి: ప్రముఖ నటుడు, దివంగత డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి ఉత్సవాలు ఆరంభం అయ్యాయి. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ విగ్రహావిష్కరణతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అక్కినేని కుటుంబం. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అక్కినేని నాగార్జున తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నివాళి అర్పించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అఖిల అక్కినేని, నాజర్, నాని, మంచు విష్ణు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్.. ఇలా సినిమా, రాజకీయరంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ప్రసంగించారు. అక్కినేని నాగేశ్వరరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 17వ ఏటనే సినీ రంగ ప్రవేశం చేశారని, దశాబ్దాల పాటు ప్రయాణం చేశారని పేర్కొన్నారు. నాగేశ్వర రావు సినీరంగ ప్రయాణం అనితర సాధ్యమని, వర్ధమాన నటులకు ఆదర్శప్రాయమని చెప్పారు.
ఈ సందర్భంగా రాజకీయాలపైనా వెంకయ్య నాయుడు మాట్లాడారు. రాజకీయాల కంటే కూడా సినిమా ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుందని అన్నారు. ప్రజల మనస్సులను సినిమాలు వెంటనే ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. పేదవాడికి కూడా చాలా తక్కువ ఖర్చుతో వచ్చే వినోదమే ఈ సినిమాగా అభివర్ణించారాయన.
కొంతమంది రాజకీయాల్లో నటిస్తోన్నారంటూ చురకలు అంటించారు వెంకయ్యనాయుడు. చౌకగా, చౌకబారుగా నటిస్తున్నారని, అలాంటి వారి వల్ల, అలాంటి నటన పట్ల ఏ మాత్రం ఉపయోగం ఉండబోదని వ్యాఖ్యానించారు. అలాంటి వారి పట్ల ఇతరులకు ఎలాంటి స్ఫూర్తి కలగదని పేర్కొన్నారు.
రాజకీయాల్లో నటించడానికి బదులుగా సినిమాల్లో కొనసాగితే.. పూర్తిస్థాయిలో స్ఫూర్తిని అందించవచ్చని వెంకయ్యనాయుడు ఆ కొందరికి హితవు పలికారు. వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించినవేననే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమౌతోన్నాయి.
గతంలో పవన్ కల్యాణ్.. వెంకయ్య నాయుడిపై ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయాల్లో పాచిపోయిన లడ్డూ అంటూ కామెంట్స్ చేశారు అప్పట్లో. వెంకయ్య నాయుడు తన స్వర్ణ భారతి ట్రస్ట్‌పై పెట్టిన శ్రద్ద ఏపీ సమస్యలపై పెట్టి ఉంటే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేదనీ వ్యాఖ్యానించారు. దీనికి తాజాగా వెంకయ్య నాయుడు రివెంజ్ తీసుకున్నట్టయిందని చెబుతున్నారు.
[zombify_post]