ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ కార్యక్రమానికి సన్నద్ధమౌతోంది. అయిదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించడానికి సన్నాహాలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అవి అందుబాటులోకి రానున్నాయి
దీనికోసం వైఎస్ జగన్.. శుక్రవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలను ప్రారంభిస్తారు. అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే వేదికపై నుంచి రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో మెడికల్ కాలేజీలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వైద్య విద్యను అభివృద్ధి పర్చడానికి ప్రతి జిల్లాకు ఓ ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించాలని వైఎస్ జగన్ సంకల్పించిన విషయం తెలిసిందే. దీనికోసం 8,480 కోట్ల రూపాయల వ్యయంతో 17 కొత్త కాలేజీలు నిర్మిస్తోంది. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఆయా కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలు కానున్నాయి. ఈ అయిదు కాలేజీల్లో ఒక్కో కళాశాలలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో మరో అయిదు మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకుని రావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా నిర్మాణ పనులను వేగవంతం చేసింది.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం, పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటోన్నట్లు ప్రకటించడం.. వంటి పరిణామాల మధ్య జగన్.. తొలిసారిగా బహిరంగ సభలో ప్రసంగించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి దృష్టినీ ఆకట్టుకుంది.
ఆయన బహిరంగ సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు సంధిస్తుంటారు. అలాంటిది- పొత్తుపై పవన్ నుంచి విస్పష్ట ప్రకటన వెలువడిన తరువాత జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. దీనితో విజయనగరం బహిరంగ సభలో జగన్ ఏం మాట్లాడతారనేది చర్చనీయాంశమైంది.
[zombify_post]