తిరుమల :సెప్టెంబర్ 07 తిరుమల లో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గోగర్భం డ్యామ్ వద్ద ఉన్న ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి పంచాభిషేకాలు, ఉట్లోత్సం నిర్వహించారు.
ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, వీజివో బాలి రెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 8 నుంచి 10 గంటల వరకు శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం ద్వాదశ ఆరాధన నిర్వహించే కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
అనంతరం ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానాన్ని చేపడుతామని వివరించారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల మధ్య అత్యంత వైభవంగా ఉట్లోత్సవం, శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఈ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసిందన్నారు.

[zombify_post]