పాడేరు అల్లూరి జిల్లా: నిరుద్యోగ గిరిజన యువతకు సివిల్స్ శిక్షణ అందిస్తున్నామని ఐటిడి ఏ పి ఓ వి. అభిషేక్ వెల్లడించారు. 50 గిరిజన కుటుంబాలలో ఉద్యోగ వెలుగులు నింపాలనేది ఆశయమన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగా సివిల్స్ శిక్షణను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈనెల 3 వ తేదీ నుండి 7 వ తేదీ సాయంత్రం 4గంటల వరకు సివిల్స్ శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. 15వ తేదీన మొదటి దశ రాత పరీక్ష నిర్వహించి 18న ఫలితాలు వెల్లడిస్తామని తెలియ జేసారు. 22 వతేదీన రెండవ దశ పరీక్ష నిర్వహించి 2న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. రెండవ దశ పరీక్షలో నెగిటివ్ మార్కులు విధానం అమలు చేస్తామన్నారు. 24 వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామన్నారు. 27,28 తేదీలలో ఇంటర్వూలు నిర్వహించి 50 మంది అభ్యర్థులను సివిల్ కోచింగ్కు ఎంపిక చేసి 9 నెలలు ఉచిత, వసతి, భోజన సదుపాయంతో శిక్షణ అందిస్తామన్నారు. ప్రముఖ సివిల్స్ కోచింగ్ సెంటర్ల నుండి ఫ్యాకల్టీలను తీసుకుని వచ్చి అంకిత భావంతో శిక్షణ అందిస్తమన్నారు. సివిల్స్ శిక్షణకు సుమారు రూ.60 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఈ శిక్షణ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగ పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 గ్రూప్ -1 ఉద్యోగాలకు, 500 గ్రూప్ 2 ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేస్తోందని అన్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది ఎంపికయ్యే విధంగా శిక్షణ అందిస్తామన్నారు. పాడేరు, అరకు వ్యాలీ, చింతపల్లి కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పాడేరు ఐటిడి ఏ పరిధిలోని గిరిజన యువత డిగ్రీ పూర్తి చేసి 21 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!