అల్లూరి సీతారామరాజు జిల్లా లో డోలు మోతలు తప్పడం లేదు . ఆ గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం లేక అయిదు కిలోమీటర్ల దూరం మృతదేహాన్ని డోలీ మోతతో గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చింది.కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కింటుకూరు గ్రామానికి చెందిన గిరిజన మహిళ మడి జోగమ్మ (50) మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.అక్కడే చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. కాకినాడ నుంచి వచ్చిన అంబులెన్సులో కింటుకూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్ క్యాంపు వద్ద మృతదేహాన్ని దించేసి వెళ్లిపోయింది. అక్కడి నుంచి గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో అటవీ ప్రాంతంలో అయిదు కిలోమీటర్లు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని డోలితో మోసుకెళ్లారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకుడు బచ్చెల బొజ్జిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పైబడుతున్నా కింటుకూరుగ్రామానికి రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐటీడీఏకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ పరిస్థితే ఈ విధంగా ఉంటే మారుమూల గ్రామాల్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!