నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తమ కుమార్తె యశస్వికి వైద్య చికిత్స అందించాలని విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస గ్రామానికి చెందిన దంపతులు పాలవలస వెంకటరావు, దేవి కోరారు. గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన సందర్భంగా ఇటీవల మరడాం వచ్చినపుడు ముఖ్యమంత్రి వద్దకు తమను అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కలిసేందుకు వెళ్లినా అధికారులు అనుమతివ్వలేదని వాపోయారు. తమ కుమార్తెను కాపాడాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
ఇల్లు అమ్మి వైద్యం..:
క్యాన్సర్తో బాధపడుతున్న తన ఇద్దరు కుమారుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని కోరాడ వీధికి చెందిన పట్నాల రాజు అధికారులకు వినతిపత్రం అందజేశారు. దివ్యాంగులైన తన కుమారులు శ్రీనివాస్(20), శ్రీరామ్ (15) రెండేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నారని, ప్రస్తుతం వీరికి పింఛన్లు మాత్రమే వస్తున్నాయని.. వైద్య చికిత్సకు నెలకు సుమారు రూ.30 వేల వరకు ఖర్చవుతోందని వాపోయారు. ఇప్పటికే ఇల్లు అమ్మి వైద్యం చేయించానని కన్నీటి పర్యంతమయ్యారు. సిగరెట్లు అమ్ముతూ జీవిస్తున్న తనకు రోజుకొచ్చే రూ. 250 సంపాదనతో వారిని పోషిస్తున్నానని వాపోయారు. సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసినా ఎలాంటి ఫలితం లేదని, జగన్మోహన్రెడ్డి స్పందించి, న్యాయం చేయాలని కోరారు.
[zombify_post]