నంద్యాల: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బస చేసిన నంద్యాలలోని ఆర్.కె.ఫంక్షన్ హాల్ దగ్గర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు బస చేస్తున్న ప్రదేశానికి అధికసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు.
అనంతపురం నుంచి పోలీసు బృందాలను నంద్యాలకు రప్పించారు. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తెదేపా శ్రేణులు ఆర్.కె ఫంక్షన్ హాల్ వద్దకు భారీగా తరలివచ్చాయి. శనివారం ఉదయం 5 గంటల తర్వాత చంద్రబాబు బస చేస్తున్న వాహనం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. వాహనం చుట్టూ ఉన్న తెదేపా నేతలను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కాలవ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్‌రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితర స్థానిక తెదేపా నేతలు ఉన్నారు..
అంతకుముందు 3 గంటల సమయంలో పోలీసులు, తెలుగుదేశం శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. తెదేపా శ్రేణుల్ని నెట్టుకుంటూ పోలీసులు ముందుకు వెళ్లారు. చంద్రబాబు ప్రధాన భద్రతాధికారి, ఎన్ఎస్జీ అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఎన్ఎస్జీ కమాండెంట్‌కి పోలీసులు సమాచారం ఇచ్చారు. మరోవైపు అర్ధరాత్రి చంద్రబాబుని నిద్రలేపడం సరికాదని, ఆయన ఎక్కడికీ పారిపోయే వ్యక్తి కాదంటూ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న బస్సు డోర్ కొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులను తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. మూడు గంటల ప్రాంతంలో చంద్రబాబు బస చేస్తున్న ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలపాలని తెదేపా నేతలు పోలీసులను ప్రశ్నించారు. ఈ విషయమై చంద్రబాబుకు తప్ప ఎవ్వరికీ సమాధానం చెప్పమని పోలీసులు పేర్కొన్నారు. కేసు ఏంటని నాయకులు, న్యాయవాదులు అడిగినా వారు సమాధానం చెప్పలేదు. దీంతో పోలీసుల తీరుపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం వస్తే తామే చంద్రబాబును కలిసే ఏర్పాటు చేస్తామని తెదేపా నేతలు పోలీసులకు చెప్పారు. అర్ధరాత్రి చంద్రబాబు కాన్వాయ్ కదులుతోందనే సమాచారంతో ఇక్కడికి వచ్చామని పోలీసులు తెలిపారు. వాహనాలను అడ్డు తొలగించాలని పోలీసులు వారికి సూచించారు. చంద్రబాబుకు ఇబ్బంది కలుగకుండా వెళ్తే వాహనాలు అడ్డుతీస్తామని తెదేపా శ్రేణులు పేర్కొన్నాయి..
[zombify_post]