in ,

రాజ్యాంగాన్ని విస్మరిస్తే…అధోగతే!.డా.టి.జనార్దన్‌

రాజ్యాంగాన్ని విస్మరిస్తే…అధోగతే!.~ డా.టి.జనార్దన్‌ 94901 08656

భారత రాజ్యాంగం ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం సంతరించు కుంటోంది. ప్రజాతంత్ర వాదులు, ప్రతిపక్షాలేకాకుండా అధికార పార్టీ సైతం రాజ్యాంగాన్ని స్తుతిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకై ఇటీవల జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల పూర్వరంగం నుంచి ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. కేంద్రంలో అధికారంలో వున్న నేటి ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో రాజ్యాంగ వ్యవస్థలను క్రమ పద్దతిలో ధ్వంసం చేయడంతో పాటు అనేక వ్యవస్థలను నీరుగార్చింది. మూడోసారి సైతం తమకు 400 సీట్లు గ్యారంటీ అంటూ బీజేపీ నేతలు ఊదరగొట్టారు. ఈ విషయంలో ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడం, మైనార్టీలను నానా విధాలుగా దూషించడం, విదేశీయులుగా ముద్ర వేయడం వారిలో పూర్తి అభద్రతా భావం నెలకొనేలా చేశారు. తద్వారా మెజారిటీ హిందూ ఓట్లను గంపగుత్తగా కొట్టేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనికోసం బీజేపీ సుధీర్ఘ కాల అజెండా అయిన అయోధ్య రామాలయ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఎంతో హడావుడిగా ప్రారంభోత్సవం చేసింది. ఆలయ ప్రారంభోత్సవానికి రానివారిని హిందూ వ్యతిరేకులుగా ముద్రవేసే కుటిల రాజకీయ పన్నాగం పన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్నికల్లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో ఘోరంగా వ్యతిరేక ఫలితాలు మూటగట్టు కోవడమే గాకుండా, అయోధ్య ఎంపీ స్థానాన్ని సైతం కోల్పోవలసి వచ్చింది. మూడు నల్ల చట్టాలపై ఉద్యమించిన రైతాంగంపై దమనకాండ జరిపిన ప్రాంతాల్లో యూపీ, హర్యానా, పంజాబ్‌లో సైతం వ్యతిరేక పవనాలు వీచాయి. అధికారమదంతో మెజారిటీ మతస్థులు తమకు అనుకూలంగా వున్నారని, ఇష్టానుసార నిర్ణయాలు చేసి, ప్రపంచవ్యాప్తంగా తలవంచుకునే సంఘటనలకు కారణమైన మణిపూర్‌ ఉదంతం చివరకు చేదు ఫలితాలను మిగిల్చింది. మణిపూర్‌లో రెండు ఎంపీ సీట్లు ఇండియా కూటమి ఖాతాలో పడ్డాయి. మెజారిటీ వాదనతోనే అన్ని సార్లు నెగ్గుకు రాలేమనే విషయం మణిపూర్‌ ఎన్నిక రుజువు చేసింది.

దేశంలో మొత్తం మీద బీజేపీ బలం తగ్గి చివరకు భాగస్వామ్య పార్టీలపై ఆధారపడే స్థితి నెలకొంది. ఈ మధ్యే ఎన్డీయేలో చేరిన జేడీయూ, టీడీపీ మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు. దీంతో ప్రధాని వైఖరిలో గుణాత్మక మార్పు వస్తుందని భావించినా అటువంటిది ఏమీలేదు. ఎన్డీయే సమావేశంలో నితీశ్‌, చంద్రబాబును పక్కనే కూర్చొబెట్టుకొని ముసిముసి నవ్వులతో వారిని ప్రసన్నం చేసుకోవడం గమనించాం. ఇప్పుడంతకన్నా ముఖ్యంగా గత పదేళ్ల కాలంలో అప్రకటిత, అత్యవసర స్థితి నుంచి దేశం విముక్తి చెందబోతున్నట్లుగా ప్రజాస్వామ్య వాదులు భావిస్తున్నట్లు గోచరిస్తోంది. ప్రధాని నోట ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు వల్లెవేయడం ఆశ్చర్యం కలుగుతోంది. ఎన్నికల మునుపు బీజేపీ లాంటి మితవాద, కార్పొరేట్‌ అనుకూల, ఫాసిస్టు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి అవశ్యకతను గుర్తించి మెజార్టీ చోట్ల పోటీచేయడంతో బీజేపీని ఇండియా కూటమి కట్టడి చేయగల్గింది. దీంతో 400 సీట్లు సాధించగలమనే బీజేపీ ధీమా, తద్వారా మనువాద రాజ్యాంగాన్ని తీసుకొస్తామనే దురాలోచనకు బ్రేక్‌ పడినట్లయింది.

ఎన్నికల ఫలితాల సరళి అవగతమైనప్పటి నుంచి ప్రధాని హావభావాలు మారిపోయాయి. ఒక దశలో తన సొంత సీటు వారణాసిలో ఓటమి పాలవతాడేమోనని భావించారు. చివరికి మెజార్టీ గతం కంటే 2 లక్షలకు పైగా ఓట్లు తగ్గాయంటే యూపీ ప్రజానీకంలో బీజేపీ పట్ల వ్యతిరేక భావన ఏ మోతాదులో వుందో బోధపడిరది. చివరికి ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధాని నోట అంబేద్కర్‌ పట్ల గౌరవభావం ప్రదర్శించడం, భారత ప్రజాస్వామ్య గొప్పతనం గురించి, మన రాజ్యాంగ ఔనత్యాన్ని పదే పదే కొనియాడటం మనం గమనించాం. ప్రతిపక్ష ఇండియా కూటమి, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు సంక్షిప్త పుస్తక రూపంలో ముద్రించిన రాజ్యాంగ ప్రతులను గత కొద్ది రోజులుగా వివిధ కార్యక్రమాల్లో ప్రదర్శిస్తున్నారు. చివరకు పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా ఇండియా కూటమికి చెందిన ప్రతి సభ్యుడు రాజ్యాంగ బుక్‌లెట్స్‌ను సభలో ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడంలేదనే భావన దేశ ప్రజలకు కల్పించేలా ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం లేకుండా ప్రవర్తించడం, మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చుతామని పదే పదే ప్రకటించడంతో దేశ ప్రజలు బుద్ది చెప్పాలని పూనుకున్నారు. దాని ఫలితమే బీజేపీకి యూపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఎదురు దెబ్బ తగిలి 240 సీట్లకు పరిమితమయ్యారు.

భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఎంతో భిన్నంగా ప్రభుత్వాల నిర్వహణకు వాటి మనుగడకు, ప్రజల ఆకాంక్షల మేరకు కొలబద్దంగా ఉంటోంది. అయితే కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో రాజ్యాంగంలోని అతి ముఖ్యమైన ప్రాథóమిక హక్కులను సైతం కాలరాయడం దేశ ప్రజలంతా గమనించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 మేరకు చట్టం ముందు అందరూ సమానం అనేది మర్చిపోయారు. కార్పొరేట్లకు పలుకుబడి, ధన రాజకీయాలకు ముడిపడే చట్టాలు అమలవుతున్నాయి. పేదల్ని పూర్తిగా విస్మరించారు. శతకోటీశ్వరులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగారు. ప్రాథమిక హక్కులలో ప్రధానమైన ఆర్టికల్‌ 19 అందులో (ఏ) భావ ప్రకటనా స్వేచ్ఛ (బి) సమావేశాలు నిర్వహించుకొనే హక్కు, (సి) సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్చ (డి) స్వేచ్ఛగా ఎక్కడైనా తిరిగే వెసులుబాటు వంటివి ప్రధానమైనవి. ఆర్టికల్‌ 21 వరకు జీవించే హక్కు, ఆర్టికల్‌ 22 మేరకు ముందస్తు నిర్భంధం చట్ట విరుద్ధం వంటివి ప్రాథóమిక హక్కుల జాబితాలో వున్నాయి. దేశంలోని పౌరులు సమాజంలో గౌరవ ప్రదంగా తలెత్తుకు తిరిగేందుకు, తమకు ఇతరుల నుంచి, రాజ్యాంగం నుంచి సమస్యలు తలెత్తినప్పుడు కాపాడుకునేందుకు వివిధ చట్టాలను రక్షించేందుకు రాజ్యాంగం ఎంతగానో దోహదపడుతోంది. అయితే ఇటీవల పౌరులకు రక్షణ లేక ప్రజా సంఘాలంటే లెక్కలేనితనం మూలంగా రైతాంగం, కార్మికులు, విద్యార్థి, యువజనలు, మహిళలు, దళిత, బలహీన వర్గాలు, పౌరహక్కుల నేతలు అక్రమ నిర్భంధాలకు గురికావడం, సమావేశాలకు అనుమతి లేకుండా చేయడం,ప్రముఖ రచయితలు, నేతలపై కేసులు పెట్టి జైళ్లకు పంపడం, దళితవర్గాలకు చెందిన వారిని మట్టుపెట్టడం వంటి వికృత చేష్టలకు ఒడిగట్టారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమకు గిట్టని వారిపై అర్బన్‌ నక్సల్స్‌ అని, పాకిస్థాన్‌ ఏజెంట్లు అని, విదేశీ సాయం పొందుతున్నారన్న సాకులతో రాజద్రోహం, ఉపా లాంటి చట్టాలను తీసుకొచ్చి నిర్బంధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రజా ఉద్యమాలను పూర్తిగా అణచివేసింది. ఎన్‌జీఓలు, ఉపాధ్యాయులు, మునిసిపల్‌ ఉద్యోగులు, అంగన్‌వాడీల సమ్మెలను పూర్తిగా కలరాసింది. బ్రిటీష్‌ కాలం నాటి చట్టాలను తిరగదోడి, బహిరంగ సభల నిర్వహణకు అనుమతులను నిషేధించింది. చివరకు నాయకుల పాదయాత్రలకు, బహిరంగ సభ నిర్వహణకు అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. రాష్ట్రంలో పోలీస వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. చట్టాన్ని మన రాష్ట్రంలో దుర్వినియోగం చేసినట్లు మరెక్కడా దాఖలు లేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సమావేశాల నిర్వహణకు ప్రజలను చేరవేసేందుకు బస్సులను కేటాయించమని కోరాగా ప్రభుత్వ నిరాకరించింది. 90శాతం ప్రజలు ప్రభుత్వ విధానాలను అనుక్షణం పసిగడ్తారని పాలకులు గుర్తించాలి. ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను, మీడియాను సామాజిక మాద్యమాన్ని సైతం విస్మరించరాదు. ఆ దిశగా మన రాజ్యాంగ విలువలను కాపాడుతూ పాలకులు, ప్రజాతంత్ర పద్దతులను కాపాడుతారని ఆశిద్ధాం.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి వినతి పత్రం అందించినజిల్లా

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి లేఖ