అక్టోబర్ 25 నుంచి బస్సుయాత్ర.. పార్టీ విస్తృత సమావేశంలో సీఎం జగన్*
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో ఆయా పార్టీలు దూకుడు పెంచాయి. ఇక అధికార పార్టీ వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు పలు సూచనలు చేస్తున్నారు. సోమవారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు 8 వేల మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు కష్టపడాలని అన్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి పథకాలను మరింత విస్తృత్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యచరణను ముందుకు తీసుకెళ్లడంపై ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, మేనిఫెస్టోను ఇంత పక్కాగా అమలు చేసిన పార్టీ దేశంలోనే లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని సీఎం అన్నారు. పేదల గురించి ఆలోచించిన పార్టీ వైసీపీ మాత్రమేనని, పేదలకు అండగా నిలిచామని అన్నారు. పేదలను ప్రభుత్వం అదుకుందని అన్నారు.
అలాగే మహిళా సాధికారతకు కృషి చేశామని, మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజలకు మేలు జరగాలని, నవంబర్ 10 వరకు జగనన్న ఆరోగ్య సురక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏ కుటుంబం కూడా అనారోగ్యం బారిన పడకూడదని, పేదవాళ్లను కాపాడుకోవాలన్నదే ఆరోగ్య సురక్ష లక్ష్యమన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షతో కోటీ 60 లక్షల ఇళ్లను కవర్ చేస్తున్నామని, 5 దశల్లో జగనన్న ఆరోగ్య సురక్షఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 15వేల హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నామని, రోగి పూర్తిగా కోలుకునే వరకూ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31వరకు బస్సుయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని అన్నారు. మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామని, బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలుంటారని, రోజు మూడు చొప్పున సమావేశాలు జరుగుతాయన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!