- గురు న్యూస్, విశాఖపట్నం :ఆంధ్రప్రదేశ్ లోనే అత్యుత్తమ వైద్య సంస్థగా విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. స్థానిక విమ్స్ ను విడదల రజిని గారు సందర్శించారు. వార్డుల్లో కలియతిరుగుతూ రోగులతో ఆప్యాయంగా మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరు, మందుల పంపిణీపై ఆరా తీశారు. భోజన సదుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందుతున్న తీరుపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగం, ఐసీయూ వార్డులను తనిఖీ చేశారు. అనంతరం నేరుగా రోగులతో సంభాషించారు. ఆరోగ్యశ్రీ, ఐసీయూ, జనరల్ సర్జరీ, న్యూరో, ఫిజియోధెరపీ ఇతర విభాగాలను సందర్శించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎక్కడా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వైద్యసేవలు సకాలంలో అందించాలని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబును ఆదేశించారు. మందుల నిల్వల విషయంపై ఫార్మసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం సమావేశ, మందిరంలో వైద్యులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ రాంబాబు విమ్స్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మంత్రి గారు మాట్లాడుతూ త్వరలోనే విమ్స్‌లో ఖాళీగా ఉన్న స్పెషలిస్టు పోస్టుల భర్తీ చేపడతామని, ఇప్పటికే దీనికి సంబంధించిన జీవో సిద్దమైందన్నారు. ఆసుపత్రిలో సమస్యలు, విమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్‌తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. విమ్స్‌లో స్పెషలిస్టు డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఒక్కొకరికి నెలకు రూ.1.6లక్షల వేతనం చెల్లించేలా వైద్యుల నియామకాలకు అనుమతులు కూడా మంజూరు చేశామని వివరించారు. వైఎస్సార్ ఆశయసాధన మేరకువిమ్స్‌ను సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన అనుమతులు, నిధులు మంజూరుచేస్తామని తెలిపారు. విశాఖలో మరింత మెరుగైన వైద్య సేవలను ప్రజలకు పూర్తి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో 2007లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు విమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాల సాధన మేరకు విమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నాడు- నేడు కింద విమ్స్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. సంబంధిత పనులను త్వరలోప్రారంభిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం పది కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూరోలాజికల్ (సీబీఆర్ ఎన్ ) సెంటర్లు ఏర్పాటుచేసేందుకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. ఆ పది సెంటర్లలో వైజాగ్ కూడా ఎంపికైందని చెప్పారు. సీబీఆర్ ఎన్ సెంటర్ ను విమ్స్ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రసాయనాలు, అణుబాంబులు, బయో వార్ తదితరాల ఫలితంగా వైద్యం అవసరమైన వారందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు సీబీఆర్ ఎన్ సెంటర్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఇప్పటికే సీబీఆర్ ఎన్ సెంటర్ కోసం సిబ్బంది నియమాకాలు, శిక్షణ కూడా పూర్తయ్యాయని వివరించారు. విశాఖ కేజీహెచ్‌ను, విమ్స్‌ను ఉత్తరాంధ్ర ప్రాంతానికి రెండు కళ్లుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం విమ్స్‌లో డయాగ్నస్టిక్ సెంటర్, ఆయుష్, ఔషధ నియంత్రణ విభాగ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో విమ్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు గారు, ఏపీఎంస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి గారు, డీఎంఈ నర్సింహం గారు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]