పెదబయలు, సెప్టెంబర్ 27:- బుధవారం పెదబయలు మండల కేంద్రంలో నిర్వహించినజగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజలు తమ సమస్యలను విన్నపాల రూపంలో తగు పరిష్కారం కోసం కలెక్టర్ కు సమర్పించారు. రికార్డు స్థాయిలో 207 విన్నపాలు సమర్పించటం విశేషం. కలెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్ తో సహా జిల్లా అధికారులందరూ మండల స్థాయి స్పందనకు హాజరు కావటంతో ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. అందులో అధిక శాతం రెవిన్యూ, పంచాయతి రాజ్, రహదారులు, గృహ మంజూరు కోసం దరఖాస్తులు వచ్చాయి.ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు మరింత చేరువగా మెరుగైన సేవలు అందించటానికి, వారి సమస్యలు అత్యంత దగ్గరగా పరిశీలించటానికి మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన వేదికగా ఉంటుందని చెప్పారు. సమస్యల పరిశ్కారానికి జిల్లా యంత్రాంగం వచ్చినందున సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకంతో ప్రజలు విజ్ఞాపనలు సమర్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి సమస్యను పరిశ్కరించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని, ప్రతి సమస్యపై ఒక విచారణ అధికారిని నియమించి సకాలంలో పరిష్కారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.పెదబయలు స్పందనలో అందిన కొన్ని ముఖ్య సమస్యలు :
1.గొమ్మంగి పంచాయతి కోరుగొండ గ్రామానికి చెందిన గడతూరి దమయంతి తన కుమారునికి ఉద్యోగము ఉన్నందున వృద్దాప్య పెన్షన్ ఆగిపోయిందని, కాని తన కుమారుడు ఆమెతో కలిసి ఉండడం లేదని, హౌస్ హోల్డ్ మాపింగ్ లో కూడా తన పేరు తొలగించినందున తనకు మళ్ళీ వృద్దాప్య పెన్షన్ మంజూరు చేయవలసినదిగా కోరుతూ అర్జీ సమర్పించారు.
2.రాగోలుపేట గ్రామమునకు చెందిన జి. పార్వతమ్మ తను 2015 నుండి 2021 వరకు
వెలుగు కార్యాలయములో పనిచేశానని, తను గర్భవతిగా ఉన్న సమయంలో ఎటువంటి నోటీసు లేకుండా విధుల నుండి తొలగించారని, తనకు మరల యదావిధిగా ఉద్యోగం కల్పించాలని అర్జీ సమర్పించారు.
3.సీకరి గ్రామస్తులు తమ గ్రామంలో చెక్ డాం నిర్మాణం కోరుతూ విజ్ఞప్తి చేశారు.
4.వై. పేరుపల్లి గ్రామం నుండి ఉక్కుర్భ గ్రామం వరకు 10 కిమీ మధ్యలో 4 గ్రామాల ప్రజలు వినియోగిస్తున్న రోడ్డు వర్షానికి కొట్టుకుపోయినందున తారు రోడ్డు నిర్మాణం కోరుతూ ఆయా గ్రామాల ప్రజలు దరఖాస్తు చేసారు.
5.పాడేరు నుండి కుమడ వరకు నడుస్తున్న బస్సును జామగూడ వరకు పెంచాలని ఆ గ్రామా ప్రజలు కోరారు.
6. పెదబయలు లో ఉన్న బస్ స్టేషన్ ను వినియోగంలోకి తీసుకు రావాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేసారు.
7.సీతగుంట పంచాయతి లకాయిపుట్టు, చెందిన కిముడు సత్తిబాబు, కొండా రాజారావు తమకు చేపలవేటకు
బోటు ఇప్పించవలసినదిగా అర్జీ సమర్పించినారు.
8.బొంగరం పంచాయతి బిట్రకాయపుట్టు, కొండమామిడి, రాల్లగొంది, పోతులగరువు గ్రామస్తులు తమ గ్రామంలో జ్వరాలు ఎక్కువగా వస్తున్నందున గర్భిణీలకు కనీస వైద్యం సదుపాయం కొరకు కమ్యునిటీ హెల్త్ వర్కర్ ను నియమించవలసినదిగా విజ్ఞప్తి చేసారు.
ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు సంయుక్త కలెక్టర్ జే. శివశ్రీనివాసు, జిల్లా స్థాయి అధికారులు, పెదబయలు మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!